కూటి కోసం.. కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని వలస వచ్చిన కూలి జనాలకు.. పీడకల లాంటి రోజులు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. కరోనా దెబ్బకు గతేడాది లాక్ డౌన్ సమయంలో చిందరవందరైన జీవితం, వారు పడిన కష్టం ఎవరూ మర్చిపోలేదు. సెకెండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో పలు రాష్ట్రాల్లో మరోసారి లాక్ డౌన్, జనతా కర్ఫ్యూ దిశగా సాగుతుండటంతో…వలస జీవులకు మళ్లీ కష్టాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. మహారాష్ట్ర సహా తెలుగు రాష్ట్రాల నుంచి తట్టాబుట్టా సర్దుకుని సొంతూళ్ల బాట పడుతున్నారు. పని చేసే చోట పనులు నిలిచిపోతున్నాయి.
చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బు అయిపోతోంది. రెండోసారి లాక్ డౌన్ విధించే అవకాశాలు లేవని స్వయంగా ప్రధాని మోదీ ప్రకటించినా కూడా వారిని అనుమానాలు వేధిస్తున్నాయి. ఉరుములేని పిడుగులా ఎప్పుడైనా లాక్ డౌన్ ప్రకటించవచ్చని, భావిస్తున్నారు కార్మికులు. మళ్లీ రాకపోకలు పై నిషేధాజ్ఞలు పెడతారన్న భయంతో కూలి జనం సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఇప్పటికే దాదాపు దేశంలో సగం రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూలు అమలులోకి వస్తున్నాయి. మిగతా చోట్ల ఆంక్షలు కఠినం గా ఉంటున్నాయి.
ఈ తరుణంలో దేశం మొత్తానికి తాళం పడే రోజు దగ్గర్లోనే ఉందనే అనుమానాలు వలస కార్మికుల్లో ఎక్కువయ్యాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే.. ముందస్తుగా సొంతూళ్లకు వెళ్లడం మేలని డిసైడ్ అయ్యారు కార్మికులు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు రద్దీగా మారాయి. గత ఏడాది ఇదే సమయంలో లాక్‌డౌన్ కారణంగా కూలిజనం నానా కష్టాలు పడ్డారు. ఇటు పని దొరక్క…అటు సొంతూళ్లకు వెళ్లలేక తిండీ తిప్పలు లేక పస్తులతో అలమటించారు. లక్షలాదిమంది కాలినడకన వేల కిలోమీటర్లు నడిచి సొంతూళ్లకు వెళ్లారు. మార్గమధ్యలోనే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సారి మళ్లీ ఆ పరిస్థితి రాకూడదని ముందుగానే జాగ్రత్త పడుతున్నారు.
లేదంటే అవస్ధలు తప్పవన్నది వారి భయం. స్వస్థలాలకు వెళ్లిపోతే ఐనవారితో ఉండి.. ఉన్నది కాస్తా తిని కడుపు నింపుకోవచ్చని ఆవేదనతో చెబుతున్నారు కార్మికులు. సెకెండ్ వేవ్ రూపంలో ఇప్పటికే ఉపద్రవం ముంచుకొస్తోంది. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర లాంటి చోట్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ఒక్కరోజే వెయ్యి మందికి పైగా చనిపోతున్నారు. దీంతో మహారాష్ట్ర లాక్‌డౌన్ దిశగా వెళ్తోంది. ఇప్పటికే జనతా కర్ఫ్యూ పెట్టారు. ఆంక్షల్ని అక్కడి ప్రభుత్వం తీవ్ర చేసింది. అదే బాటలో మరికొన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. కఠిన ఆంక్షలు పూర్తిస్థాయిలో అమల్లోకి రాకముందే సొంతూళ్లకు వెళ్లిపోవడం మంచిదన్న నిర్ణయానికి వస్తున్నారు వలస కూలీలు. గతేడాది బాధలను గుర్తుకు తెచ్చుకుంటూ పయనమవుతున్నారు.
గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ నుంచి ఇప్పటికే పలువురు వలస కార్మికులు సొంతూళ్ల బాట పట్టారు. ముఖ్యంగా మహారాష్ట్రలోని పుణె లో పనిచేస్తున్న దాదాపు సగం మంది వలస కూలీలు సొంతూళ్ల బాట పట్టారు. సొంతూళ్లకు వెళ్తున్న వలస కార్మికులతో ఢిల్లీలోని ఆనంద్ విహార్ బస్ టెర్మినల్, అహ్మదాబాద్‌లోని కలుపూర్ రైల్వే స్టేషన్, ముంబై, సూరత్‌లోని ప్రధాన బస్టాండ్లు రద్దీగా మారాయి. యూపీ, బీహార్‌కు వెళ్లే అన్ని రైళ్లు కిటకిటలాడుతున్నాయి. వలసకూలీల కోసం మూడు ప్రత్యేక రైళ్లను నడుపబోతున్నట్టు సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఉత్తర భారతదేశంలోని ప్రధాన నగరాలకు వెళ్లే రైళ్ల సంఖ్య కూడా పెంచుతున్నట్లు తెలిపింది..