NTV Telugu Site icon

James Cameron and Rajamouli : అక్కడ ఆయన… ఇక్కడ ఈయన…!!

Rajamouli

తెలుగువారిలో ఎక్కడ చూసినా ఇప్పుడు రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ గురించిన ముచ్చటే సాగుతోంది. ఈ సినిమా ఎప్పుడు జనం ముందుకు వస్తుందా అని గత సంవత్సరం నుంచీ కాచుకున్న కళ్ళు, విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ మరింత విప్పారుతున్నాయి. ఇదిలా ఉంటే 2009లో జనం ముందు నిలచిన హాలీవుడ్ మూవీ ‘అవతార్’కు పార్ట్ 2 గురించిన ముచ్చట అప్పటి నుంచే సాగుతోంది. చిత్ర దర్శకనిర్మాత జేమ్స్ కామెరాన్ ఈ సినిమా విడుదలను ఇప్పటికి ఎనిమిది సార్లు వాయిదా వేశారు. చివరకు ఈ యేడాది డిసెంబర్ 16న ‘అవతార్-2’ జనం ముందు నిలుస్తోందని ప్రకటించారు. అప్పటి నుంచీ డిసెంబర్ 16వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ప్రపంచవ్యాప్తంగా సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికీ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద ‘అవతార్-1’ నంబర్ వన్ స్థానంలోనే ఉంది. మొదటి వారాంతంలో ‘అవతార్-1’ను అధిగమించినందుకు మూడేళ్ళ క్రితం వచ్చిన ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ పొంగిపోయింది. ‘అవతార్’నే అధిగమించామని చాటింపు వేసుకుంది. అయితే టోటల్ రన్ లో ఆ సినిమా 2, 797 మిలియన్ డాలర్ల వద్ద ఆగిపోయింది. 2, 847 మిలియన్ డాలర్లతో ఇప్పటికీ ‘అవతార్-1’దే అగ్రస్థానం. మన కరెన్సీలో రూ. 21,703 కోట్ల పైమాటే! ఇప్పుడు ‘అవతార్-2’ దానిని అధిగమిస్తుందనే ఊహలు సినీ ఫ్యాన్స్ లో చోటు చేసుకున్నాయి.

Read Also : Malvika Sood: ఓటమి పాలైన సోనూసూద్ సోదరి!

బడ్జెట్ పరంగా చూసుకుంటే, ‘అవతార్-1’ చిత్రం 237 మిలియన్ డాలర్లతో తెరకెక్కింది. అంటే రూ. 1,811 కోట్లతో రూపొంది, దాదాపు 12 రెట్లు పోగేసింది. రాబోయే ‘అవతార్-2’ బడ్జెట్ 250 మిలియన్ డాలర్లు. అంటే మొదటి భాగాని కంటే కొంచెం ఎక్కువ. మన కరెన్సీలో ఈ మొత్తం రూ.1,910 కోట్లు. ఈ సారి రాబోయే సినిమా ఖచ్చితంగా కనీసం పెట్టుబడి కంటే 13 నుండి 15 రెట్లు వస్తుందని ‘అవతార్’ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.

ఇక మన రాజమౌళి విషయానికి వస్తే, ఆయన తెరకెక్కించిన ఇంతకు ముందు చిత్రం ‘బాహుబలి-2’ రూ. 1,810 కోట్లు పోగేసి ఆల్ ఇండియా టాప్ గ్రాసర్స్ లో రెండో స్థానంలో నిలచింది. ‘దంగల్’ వచ్చేదాకా ‘బాహుబలి-2’నే మొదటి స్థానంలో ఉండేది. ‘బాహుబలి-2’ నిర్మాణ వ్యయం రూ.250 కోట్లు. అంటే ఏడు రెట్లు వసూళ్ళు చూసిందీ చిత్రం. ఇప్పుడు రాబోయే రాజమౌళి సినిమా ‘ఆర్.ఆర్.ఆర్.’ బడ్జెట్ రూ.400 కోట్లట! అంటే ‘బాహుబలి-2’ కంటే రూ.150 కోట్లు ఎక్కువ! ఈ లెక్కన ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం ‘బాహుబలి-2’ స్థాయి విజయం చూడాలంటే రూ.2, 800 కోట్లు పోగేయాలి. ‘ట్రిపుల్ ఆర్’ అంత వసూలు చేస్తుందా అన్నది కొందరి అనుమానం. రాజమౌళి కదా, ఆయన సినిమా తప్పకుండా మ్యాజిక్ చేస్తుందని మరికొందరి అభిలాష! అక్కడ జేమ్స్ కామెరాన్ రాబోయే సినిమాపై, ఇక్కడ రాజమౌళి కొత్త సినిమాపై సర్వత్రా ఉత్కంఠ! మార్చి 25న జనం ముందు నిలుస్తున్న ‘ట్రిపుల్ ఆర్’ మరి ఏ స్థాయి విజయాన్ని మూటకట్టుకుంటుందో? డిసెంబర్ 16న విడుదలయ్యే ‘అవతార్-2’ ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలన్న ఆసక్తి సినీఫ్యాన్స్ అందరిలోనూ నెలకొంది. ఏమవుతుందో చూడాలి!