NTV Telugu Site icon

Agnipath: నిర్ణయం తీసుకునే ముందు మా వాదన వినండి.. సుప్రీంలో కేంద్రం కేవియట్ దాఖలు

Centre Files Caveat In Sc

Centre Files Caveat In Sc

ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే ముందు తమ వాదన వినాలని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం విన్నవించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్ర సర్కారు కేవియట్ దాఖలు చేసింది. అగ్నిపథ్‌పై ఇప్పటివరకు మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది హరీశ్ అజయ్ సింగ్ సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు.

ఎంఎల్ శర్మ అనే న్యాయవాది అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సుప్రీంలో పిల్ దాఖలు చేసి పలు అంశాలను ప్రస్తావించారు. అగ్నిపథ్ పథకం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంటూ.. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది ఎంఎల్ శర్మ సోమవారం పిల్ దాఖలు చేశారు. వందల ఏళ్ల నాటి నుంచి విధానాన్ని ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆయన ఆరోపించారు.

అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా చెలరేగిన హింసాత్మక నిరసనపై విచారణ జరిపేందుకు.. రైల్వేలతో సహా ప్రజా ఆస్తులకు జరిగిన నష్టంపై దర్యాప్తు చేయడానికి సిట్‌ను ఏర్పాటు చేయాలని విశాల్ తివారీ అనే మరో న్యాయవాది మరో పిల్ దాఖలు చేశారు. అగ్నిపథ్ పథకం, జాతీయ భద్రత, భారత సైన్యంపై దాని ప్రభావాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు.