కరోనా పీక్ స్టేజీలో కూడా ఆక్సిజన్ కొరత లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కేంద్రం ఇచ్చిన కేటాయింపులను పూర్తి స్థాయిలో వివియోగించుకునే దిశగా కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తుంది. కొన్ని మూతపడిన ప్లాంట్ల నుంచి కూడా ఆక్సిజన్ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. రోజువారీ వినియోగానికి ఏపీకి 482 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నిల్వలు కేటాయించింది కేంద్రం. ప్రస్తుతం ట్యాంకర్ల కొరత కారణంగా పూర్తి స్థాయిలో కేంద్ర కేటాయింపులను వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి 100 మెట్రిక్ టన్నులు.. రెండు ప్రైవేటు ఏజెన్సీల నుంచి 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అలాగే ఒడిశాలోని ఆంగుల్ నుంచి 110 మెట్రిక్ టన్నులు కేటాయించినా 30 మెట్రిక్ టన్నులు రోజూ రవాణా చేస్తుంది.. ట్యాంకర్ల లభ్యత ఉంటే మరో 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తెచ్చుకునే అవకాశం ఉంది. బళ్లారి నుంచి 63 మెట్రిక్ టన్నులు చెన్నైలోని పెరంబదూరు నుంచి 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్… స్థానికంగా ప్రైవేటు ఉత్పత్తి దారుల నుంచి మరో 40 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసే అవకాశం ఉంది. ఇక ఒడిశాలోని ఆంగుల్లో దాదాపు 20 వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వరకూ నిల్వలు ఉన్నట్టు అంచనా. అయితే ఏపీలో ఆక్సిజన్ రవాణాలో కీలకంగా మారాయి 60 ట్యాంకర్లు. నైట్రోజన్ సరఫరా చేసే ఆరు ట్యాంకర్లనూ ఇప్పటికే ఆక్సిజన్ రవాణా కోసం వినియోగిస్తున్న ప్రభుత్వం… ఎయిర్ కార్గో ద్వారా ట్యాంకర్లను తెచ్చుకునేందుకు కేంద్రం సహకరిస్తే నిల్వలను పెంచుకునే అవకాశం ఉంది. ఏపీలోని వేర్వేరు ఆస్పత్రుల్లో 550 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నిల్వ చేసుకునే సామర్ధ్యం ఉంది.