NTV Telugu Site icon

New Trend Weekend Marriages: ట్రెండ్ గా మారుతున్న వీకెండ్ మ్యారేజెస్

Weekend

Weekend

నూతన సహస్రాబ్దిలో పెళ్లికి అర్థం మారిపోతోంది. పెళ్లంటే రెండు జీవితాల కలయిక.. నూరేళ్ల సహవాసం అనే సంప్రదాయ భావన క్రమంగా తగ్గిపోతోంది. దీని స్థానంలో ఇప్పుడు వీకెండ్‌ మ్యారేజ్‌ అనే కొత్త కాన్సెప్ట్‌ తెరమీదకొచ్చింది. వారాంతపు వివాహం అనే భావన బాగా పెరుగుతోంది. ఈ ఏర్పాటు వెనుక అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఈ తరం యువతరం తమ మధ్య ప్రేమ బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ఈ భావనను ఎంచుకుంటున్నారు.

ఈ తరం యువతీ యువకులు మునుపటిలా ఒకరిపై ఒకరు ఆర్థికంగా ఆధారపడటానికి ఇష్టపడటం లేదు. అమ్మాయిలు తమ ఆర్థిక స్వాతంత్ర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంతో అమ్మాయిలు..అబ్బాయిల్లో ఎవరి స్వాతంత్య్రం వారిది. ఎవరి వ్యక్తిత్వం వారిది అనే భావన రోజు రోజుకు బలపడుతోంది. ఆడ, మగ ఇద్దరూ సమానమే. ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ అని లేదు. భర్త బయట పని చేసి డబ్బు సంపాదిస్తే, భార్య ఇంటిని చక్కదిద్దుకుంటూ గృహిణి జీవితం గడిపే రోజులు పోయాయి. మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లూ సంపాదిస్తున్నారు. తమ వ్యక్తిత్వాన్ని వదులుకోవడానికి, జీవితంలో సర్దుకుపోవడానికి ససేమిరా అంటున్నారు.

Read Also: Disha Patani: విప్పి చూపించడంలో నీ తరువాతే పాప.. ఎవరైనా

ఒకరి కోసం మరొకరు వాటిని వదులుకోనక్కర్లేదు. అందమైన జీవితాన్ని మూడు ముళ్లతో బంధించి జీవితాంతం రాజీ పడనక్కర్లేదు’ వంటి ఆలోచనల నుంచి వీకెండ్‌ మ్యారేజెస్‌ కాన్సెప్టు పుట్టుకొచ్చింది. జపాన్లోనైతే ఇవి ట్రెండుగా మారాయి. అక్కడ వారాంతపు వివాహాలు .. సెపరేషన్‌ పెళ్లిళ్లు చేసుకోవడం సర్వసాధారణంగా మారుతోంది. ఇందులో భార్యాభర్తలు వారాంతాల్లో మాత్రమే ఒకరినొకరు చూసుకుంటారు. మిగతా రోజుల్లో వేర్వేరు జీవితాలను గడుపుతారు. ఇంటి పనులను విభజించుకుంటారు కానీ వారం రోజులలో ఎక్కువ సమయం కలిసి గడపరు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీల్లేని బిజీ లైఫ్‌లో గడిపేస్తున్నారు. అందుకే పెళ్లి చేసుకొని ఒకే చోట ఉండడం కంటే వీకెండ్స్‌లో కలిసి ఉండాలని ముందే ఒక అవగాహన కుదుర్చుకుంటున్నారు. వారంలో అయిదు రోజులు ఎవరి జీవితం వారిది, మిగిలిన రెండు రోజులు ఒకరికొకరుగా కలిసి జీవిస్తారు. కష్టసుఖాలు పంచుకుంటారు. గుండెల నిండా గూడు కట్టుకున్న ప్రేమని పంచుకుంటూ రెండు రోజులు రెండు క్షణాల్లా గడిపేస్తారు.

ఆఫీసులో పని ఒత్తిడి వల్ల స్త్రీ పురుషుల లైఫ్‌స్టైల్‌ ఒకేలా ఉండట్లేదు. ఒకరికి ఉదయం షిఫ్ట్‌ అయితే మరొకరికి రాత్రి షిఫ్ట్‌ ఉంటుంది. ఒకరి ఆఫీసు ఊరికి ఒక మూల ఉంటే, మరొకరిది మరో మూల ఉంటుంది. దీంతో ఒకేచోట కలిసుండే పరిస్థితి ఉండడం లేదు. పెళ్లి చేసుకున్నాక ఇద్దరిలో ఎవరికి వారే తాము పుట్టి పెరిగిన వాతావరణాన్ని వదులుకోవడానికి సిద్ధపడడం లేదు. ముఖపరిచయం కూడా లేకుండా పెళ్లి చూపుల్లోనే ఒకరినొకరు చూసుకునే జంటలు ఒకరితో ఒకరు ఎంతవరకు కలిసిపోగలరో తెలుసుకోలేకపోతున్నారు. అందుకే ముందుగా వీకెండ్స్‌లో కలిసుంటే ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చన్నది వారి ఆలోచన.

భార్యాభర్తలకి ఒకరి నుంచి మరొకరికి ఎక్స్‌పెక్టేషన్‌లు ఉంటాయి. ఆఫీసు నుంచి అలిసి­పోయి ఇంటికి వచ్చిన వారికి భాగస్వామి తమకి అనుకూలంగా లేకపోతే చిర్రెత్తుకొచ్చి దెబ్బలాటలకి దారి తీస్తాయి. అదే వీకెండ్స్‌లో మాత్రమే కలిస్తే, కలిసుండేది కాస్త సమయమైనా హాయిగా గడుపుదామని అనిపిస్తుంది. మళ్లీ వారం వరకు చూడలేమన్న ఫీల్‌తో ఒకరిపై మరొకరికి ప్రేమ పొంగుకొస్తుంది. సర్‌ప్రైజ్‌లు, రొమాన్స్‌లు కొత్తగా వింతగా అనిపించి మానసికంగా ఎనలేని సంతృప్తి ఉంటుంది. ఆర్థికంగా ఎవరి స్వాతంత్య్రం వారికుంటుంది. ఎవరికి వారు వాళ్ల ఇళ్లల్లో ఉంటారు కాబట్టి డబ్బుల్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. అబ్బాయిలు, అమ్మాయిలు అన్న తేడా లేకుండా ఈ మధ్య అందరూ తమకి మాత్రమే సొంతమైన ఒక స్పేస్‌ కావాలని బలంగా కోరుకుంటున్నారు. వీకెండ్‌ కాపురాల్లో ఎవరికి కావల్సినంత స్పేస్‌ వారికి దొరుకుతుంది.

జపాన్‌, అమెరికా, యూరప్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ వీకెండ్‌ మ్యారేజ్‌ కాన్సెప్ట్ బాగానే ఉంటుంది. కానీ ఈ అరేంజ్‌మెంట్‌ని అంగీకరించే సామాజిక పరిస్థితులు మన దేశంలో లేవు. ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో కొందరు ప్రయోగాత్మకంగా వీకెండ్‌ కాపురాలు మొదలు పెట్టారు. ఆఫీసులు చెరో మూల ఉన్నప్పుడు ఇలా వీకెండ్స్‌లో కలవడమే బెటర్‌ అని నిర్ణయించుకునే జంటలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. రోజంతా ట్రాఫిక్‌ జామ్‌లో పడి ఏ రాత్రికో ఉసూరంటూ ఇంటికి చేరడానికి బదులుగా ఎవరిళ్లలో వారుంటూ వీకెండ్‌ వరకు ఎదురు చూడడమే మంచిదన్న అభిప్రాయానికి నేటితరం వస్తోంది. కానీ వారి కుటుంబాలు దీనిని జీర్ణించుకోలేకపోతున్నాయి. సంప్రదాయ బావనలను బ్రేక్‌ చేసే దేనినీ సమాజం అంత త్వరగా అంగీకరించదు. అందుకు సమయం పడుతుంది. ఎందుకంటే ఈ తరం యువత అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యత తమ వ్యక్తిగత స్వేచ్చకు ఇస్తోంది. కాబట్టి ముందు ముందు మన దేశంలోనూ వీకెండ్‌ మ్యారేజ్‌ లు పాపులర్‌ అయ్యే అవకాశాలు లేకపోలేదు.

Read Also: Sonusood: సోనూ సూద్ పేరిట మోసం.. రూ.69వేలు స్వాహా