పల్లెప్రగతి, పట్టణ ప్రగతి పై జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల(డీ పీ వో )తో ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా లాంటి వ్యాధుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైద్యరంగంలో మౌలిక వసతులను పూర్తి స్థాయిలో మెరుగుపరుస్తామని ఈ సందర్బంగా సీఎం కెసిఆర్ తెలిపారు. ఇటీవలె 7 మెడికల్ కాలేజీలను మంజూరు చేయడం జరిగిందని, వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలో అద్భుతమైన మల్టీ సూపర్ స్పెషాలిటి హాస్పటల్ ను దేశంలోనే మెరుగైన సౌకర్యాలతో నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. వరంగల్లులో విశాల ప్రదేశంలో నిర్మించ తలపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానను, 24 అంతస్తులతో అత్యంత ఆధునిక సాకేంతిక హంగులతో గ్రీన్ బిల్డింగ్ గా తీర్చిదిద్దాలని సిఎం తెలిపారు. అత్యవసర చికిత్సకోసం వచ్చే పేషెంట్లకోసం దవాఖానా బిల్డింగ్ మీదనే హెలీకాప్టర్ దిగే విధంగా హెలీపాడ్ ను నిర్మించాలన్నారు. కెనడామోడల్ లో,ధారాళంగా గాలి వెలుతురు ప్రసరించే విధంగా క్రాస్ వెంటిలేషన్ పద్దతుల్లో హాస్పటల్ నిర్మాణముండాలని, వైద్యాధికారులను సిఎం ఆదేశించారు. అందుకు కెనడా పర్యటించి రావాలన్నారు.