NTV Telugu Site icon

Airtel Plans : మరోసారి వినియోగదారులకు షాక్‌.. పెరుగనున్న రీఛార్జ్‌ ధరలు..

Airtel

Airtel

టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ మరోసారి వినియోగదారులకు షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గత నవంబర్‌ నెలలో ఎయిర్‌టెల్‌ తన రీచార్జ్‌ ప్లాన్‌లను పెంచిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు మరోసారి రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నట్టు ఎయిర్ టెల్ సీఈవో గోపాల్ విట్టల్ మాటలను బట్టి తెలుస్తోంది. 2022లోనూ చార్జీలను పెంచనున్నట్టు ఆయన స్పష్టంగా చెప్పారు. మార్చి చివరికి ఎయిర్ టెల్ కు ఒక్కో యూజర్ నుంచి ప్రతినెలా సగటున రూ.178 ఆదాయం వచ్చిందన్న గోపాల్‌ విట్టల్‌.. దీన్ని రూ.200కు తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. ఇప్పటికీ ప్రీపెయిడ్ టారిఫ్ లు చాలా తక్కువ ధరలవద్దే ఉన్నాయంటూ, మొదటగా రూ.200కు అయినా తీసుకెళ్లాల్సి ఉందన్నారు గోపాల్‌ విట్టల్‌.

అంటే కనీసం 10 శాతానికి పైన, 20 శాతం వరకు (కొన్ని ప్యాక్ ల ధరలు) ధరలు పెంచే అవకాశం ఉంటుందని సమాచారం. గతేడాది నవంబర్‌లో ముందుగా టారిఫ్ లను పెంచుతున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించగా.. వొడాఫోన్ ఐడియా, జియో కూడ ధరలను పెంచేశాయి. ఇప్పుడు కూడా చార్జీల పెంపును ముందుగా ఎయిర్ టెల్ అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. దీర్ఘకాలంలో ఒక్కో యూజర్ నుంచి సగటు ఆదాయాన్ని రూ.300-400కు తీసుకెళ్లాలన్నది ఎయిర్ టెల్ వ్యూహం. దీన్ని ఆ సంస్థ అధినేత సునీల్ మిట్టల్ ఏడాది క్రితమే ప్రకటించారు.