వర్షాలు వదిలేలా లేవు. ఇప్పటికే వారం రోజుల నుంచి కంటిన్యూగా కురుస్తున్నాయి. గత పాతికేళ్లలో వరుసగా ఇన్ని రోజులు ముసురు పట్టడం ఇదే తొలిసారి కావొచ్చు. దీంతో పొద్దు పొడవక, సూర్యుణ్ని చూడక ఎన్ని రోజులైందో అన్నట్లుంది. ‘సన్’డే ఎప్పుడొస్తుందా అని జనం ఎదురుచూస్తున్నారు. సెలవు కోసం కాదు. వాన ఇంకెప్పుడు సెలవు తీసుకుంటుందా అని. వాతావరణం విపరీతంగా చల్లబడటంతో బయటికి రాలేక, ఇంట్లో ఉన్నా తలుపులూ కిటికీలూ తెరుచుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చాలా ప్రాంతాల్లో ఊళ్ల చుట్టూ, ఇళ్ల చుట్టూ నీళ్లు నిలవటంతో తిండి కరువై, పొట్ట నిండక, పొద్దు గడవక అక్కడివాళ్లు అవస్థలు పడుతున్నారు. మిగతా ప్రాంతాల్లో శీతల పరిస్థితుల వల్ల నాలుగ్గోడల మధ్య సైతం చెప్పుల్లేకుండా నడవలేని పరిస్థితి. మంచం మీద నుంచి కాళ్లు కింద పెడదామంటే చలికి భయమేస్తోంది. ఉతికిన బట్టలు ఎండక కొందరికి అసౌకర్యం కలుగుతోంది. ఫ్యాన్ గాలికి దుస్తులను ఆరేద్దామంటే చలి గాలి తోడై ఇల్లు మరింత చల్లబడుతోంది. ఎండ రాకపోవటంతో ఇంటి పరిసరాలు తడిసి ముద్దవుతున్నాయి.
చివరిసారిగా గత శుక్రవారమో, శనివారమో సూర్యుడు కనిపించినట్లున్నాడు. ఇక ఆ తర్వాత ఆయన ఆచూకీయే లేకుండా పోయింది. ఈ రోజు ఉదయం వచ్చాడంటున్నారు. కానీ చాలా మందికి కనిపించకుండానే పోయాడు. మళ్లీ ఎప్పుడొస్తాడో చెప్పలేని అయోమయం. రేపు, ఎల్లుండి కూడా వానలు పడతాయంటున్నారు. దీంతో మనుషుల పైన ప్రకృతి పగ బట్టినట్లు అనిపిస్తోంది. లేకపోతే ఈ అతివృష్టి ఏంటి అని జనం తమలోతామే ప్రశ్నించుకుంటున్నారు. ఎంత వర్షాకాలమైతే మాత్రం ఇంతగా, వింతలా నింగికి చిల్లులు పడాలా అని అడుగుతున్నారు.
అఫ్కోర్స్ ఈ ప్రశ్నలకు సమాధానం లేదని వాళ్లకూ తెలుసు. కానీ ఏమీ చేయలేని దుస్థితి. ఈ నేపథ్యంలో పిల్లలు, పెద్దలు, లేడీస్, టీచర్స్ ఇలా అందరూ హౌజ్ అరెస్ట్ అయిన ఫీలింగ్. ఇది వరుణుడు విధించిన లాక్డౌన్ అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఇంటి నుంచి ఆఫీసుకు బయలుదేరినా, ఆఫీసు నుంచి ఇంటి బాట పట్టినా తడవకుండా పొడిపొడిగా గమ్యానికి చేరినోళ్లను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. బస్సెక్కి వస్తావో.. బండెక్కి వస్తావో.. ఏదైనా ఎక్కేసిరా.. పక్కాగా తడిపేస్తారా అని వాన ఛాలెంజ్ విసురుతోంది.
చలికి పాత, కొత్త అనే తేడా లేకుండా బైకులు కనీసం పది సార్లయినా కిక్ రాడ్ కొట్టందే స్టార్టయితే గొప్పే అని వాహనదారులు వాపోతున్నారు. వర్షం కాసేపు ఒత్తుగా పడుతోంది. కొద్దిసేపు చిటపుట చినుకులతో సరిపెడుతోంది. కురిసీ కురిసీ అలిసిపోయిందా అనే రీతిలో మధ్యలో స్మాల్ బ్రేక్ తీసుకుంటోంది. హమ్మయ్య అనుకునేలోపే వెల్కం బ్యాక్ అంటోంది. ఇది పేరుకి వర్షాకాలమైనా చలికాలాన్ని తలపిస్తోంది. ఏసీ ఆన్ చేసినట్లు ఒళ్లు గడ్డకట్టిపోతోంది. పడిశం బారినపడుతోంది.
శాస్త్రి బామ్లకు, జండూ బామ్లకు డిమాండ్ నెలకొంది. అడపాదడపా జ్వరాలూ వచ్చిపోతున్నాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం లేకపోవటంతో రోజులు అతికష్టమ్మీద గడుస్తున్నాయి. వరుణ దేవా.. కరుణించ రావా, సూర్యభగవానుడా చూసిపోవా అంటూ జనం వేడి వాతావరణం కోసం వేడుకుంటున్నారు.