NTV Telugu Site icon

ప్రకాష్ రాజ్, నాగబాబుకి షాక్.. రాజీనామాలు తిరస్కరణ

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్ష స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన ప్రకాశ్ రాజ్ ప్యానెల్ రాజీనామాలతో పాటు నాగబాబు రాజీనామాను కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ తిరస్కరించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు వాడి వేడిగా జ‌రిగాయి.

సాధారణ ఎన్నికలను తలపించాయి. విష్ణు ప్యానెల్‌, ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్ నువ్వా నేనా అనేలా పోటీ ప‌డ్డాయి. ఒక‌రిపై ఒక‌రు విమర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు చేసుకున్నారు. ఎట్ట‌కేల‌కు విష్ణు మంచు అండ్ టీమ్ ఈ ఎన్నిక‌ల్లో విజ‌యాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నిక‌లు జ‌రిగిన తీరుని త‌ప్పు ప‌డుతూ నాగ‌బాబు, ప్ర‌కాశ్ రాజ్ అండ్ ప్యానెల్ రాజీనామాలు చేశారు. మ‌రోవైపు ప్ర‌కాశ్ రాజ్ ఎన్నిక‌ల అధికారి కృష్ణ‌మోహ‌న్ తీరుపై మండిపడ్డారు. ఆయ‌న ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించారని, ఆయనపై వత్తిడి వచ్చిందని ఆరోపించారు ప్రకాష్ రాజ్‌.

మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొదటి సారి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యుల రాజీనామాలతోపాటు మేనిఫెస్టోలో ప్రకటించిన 14 అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలు, నాగబాబు రాజీనామాను ఈసీ తిరస్కరించింది. రాజీనామాలు విరమించుకుని పదవుల్లో కొనసాగాలని విజ్ఞప్తి చేస్తూ వారికి లేఖలు రాయాలని తీర్మానించారు. మరి ఈసీ నిర్ణయానికి ప్రకాశ్ రాజ్, నాగబాబు లు ఎలా స్పందిస్తారో చూడాలి.