IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?

  • భారత్-పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్
  • భారత్-పాకిస్థాన్ ఆటగాళ్ల మధ్య గొడవ
  • వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదే
Harmanpreet Kaur And Fatima Sana Fight

Harmanpreet Kaur And Fatima Sana Fight

India And Pakistan Players Fight Video: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం భారత్-పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌పై 64 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో పాకిస్థాన్ మహిళా క్రికెటర్, ఓ భారత బ్యాటర్‌ మైదానంలోనే పరస్పరం దాడి చేసుకున్నట్లుగా.. అంపైర్లు, ఇతర ఆటగాళ్లు మధ్యలోకి వచ్చి వారిని విడదీస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియోను చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నిజంగానే మ్యాచ్‌లో ఇలాంటి ఘటన జరిగిందా? అంటూ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, పాక్ సారథి ఫాతిమా సనా షేక్ మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో మైదానంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు ఆ వీడియోలో ఉంది. అయితే వైరల్ అవుతున్న ఈ వీడియో పూర్తిగా నకిలీదని తేలింది. మ్యాచ్ సందర్భంగా ఎలాంటి ఘటన చోటుచేసుకోలేదని స్పష్టమైంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో ఈ వీడియోను కొందరు ఆకతాయిలు రూపొందించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏఐ టెక్నాలజీతో రూపొందించిన వీడియోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. ఈ వీడియో కూడా అదే తరహాలో సృష్టించబడిన ఫేక్ కంటెంట్‌గా గుర్తించారు. మ్యాచ్ రిపోర్టులు, అధికారిక ప్రసారాలు లేదా ఐసీసీ రికార్డుల్లో ఎక్కడా ఆటగాళ్ల మధ్య గొడవ జరిగినట్లు లేదు.

×
×
Ad

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన గ్రూప్-ఏ పోరులో భారత మహిళల జట్టు పాకిస్థాన్‌పై 64 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అద్భుత హాఫ్ సెంచరీ (68)తో చేయగా.. రిచా ఘోష్ చివర్లో వేగంగా ఆడి 34 పరుగులతో జట్టుకు భారీ స్కోరు అందించింది. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. నాలుగు ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి పాక్ బ్యాటింగ్‌ను కుదేలు చేసింది.