Raksha Bandhan 2022: శ్రావణమాసంలో వచ్చే రాఖీ పండగ అక్కాతమ్ముళ్లు.. అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని చాటి చెప్తుంది. అయితే ఈ ఏడాది రక్షాబంధన్‌కు సంబంధించి అందరిలోనూ సందేహాలు నెలకొన్నాయి. కొందరు పండగ ఈనెల 11వ తేదీ అంటుంటే.. మరికొందరు ఈనెల 12వ తేదీ అని వాదిస్తున్నారు. దీంతో తమ సోదరితో రాఖీ ఎప్పుడు కట్టించుకోవాలో తెలియక చాలామంది అయోమయంలో ఉన్నారు. అయితే పంచాంగం ప్రకారం చూసుకుంటే.. పౌర్ణమి ఘడియలు ఆగస్టు 11న గురువారం ఉదయం 10:37 నుంచి ప్రారంభమవుతాయి. ఈ ఘడియలు ఆగస్టు 12 ఉదయం 7:05 వరకు ఉన్నాయి.
Read Also: Indian Railways: మళ్లీ పట్టాలెక్కిన 1855 నాటి పురాతన రైలు.. కారణం ఏంటంటే..?
చరిత్ర ప్రకారం రక్షాబంధన్ రోజు భద్ర కాలానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని వేద పండితులు వివరిస్తున్నారు. భద్ర కాలంలో రాఖీ కట్టించుకోవడం అశుభం అని స్పష్టం చేస్తున్నారు. రాఖీ కట్టేందుకు శుభముహూర్తం ఉండాలని అందరూ భావిస్తారు. అయితే ఈ శుభముహూర్తం ఆగస్టు 11న రాత్రి 8:52 నుంచి 9:12 వరకు ఉంది. అంటే ఈ సమయం మధ్యలో సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టవచ్చు. అయితే రాత్రి సమయాన్ని చాలా మంది పట్టించుకోరు. అటు ఆగస్ట్ 12న కూడా పూర్ణిమ తిథి ఉండడంతో ఆ రోజు ఎప్పుడైనా రాఖీ కట్టవచ్చని జ్యోతిష్య నిపుణులు వెల్లడిస్తున్నారు. కాబట్టి రాఖీ పండగను ఆగస్టు 12న జరుపుకుంటే ఎలాంటి అభ్యంతరాలు ఉండవని స్పష్టం చేస్తున్నారు.