NTV Telugu Site icon

కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది : వైఎస్సార్‌సీపీ ఎంపీలు

శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు పార్లమెంట్‌ సమావేశాల అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైసీపీ ఎంపీలు మాట్లాడుతూ.. విభజన హామీల పట్ల కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని అన్నారు. అంతేకాకుండా ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలు వెంటనే నెరవేర్చాలని వైసీపీ ఎంపీలు డిమాండ్‌ చేశారు. భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టానికి కేంద్రం తక్షణ సాయం విడుదల చేయాలని, చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ గతి పట్టిందని ఆరోపించారు. చంద్రబాబు బుద్ధి మారాలి.. రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలు మానుకోవాలి. చేతికందిన కూడును నోటికి అందకుండా.. పేదల నోటికి, చేతికి చంద్రబాబు అడ్డుపెడుతున్నాడు. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలకు అంత ఉలుకెందుకు..? అంటూ వారు ప్రశ్నించారు.

మరో రెండేళ్ళలో విభజన హామీలు నెరవేర్చడానికి ఇచ్చిన కాలపరిమితి పూర్తికానుండటంతో వెంటనే వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అన్ని పార్టీలు ఒకే తాటి మీద నిలబడాల్సిన అవసరం ఉందని, అలాకాకుండా, స్వార్థ రాజకీయాలే పరమావధిగా టీడీపీ, రాష్ట్ర బీజేపీ నాయకులు మాట్లాడటం సమంజసం కాదని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి విమర్శలు చేయడం అంటే.. పేదవాడి పొట్టగొట్టడమేనని అన్నారు. ఎవరి వద్దా చేయి చాచకుండా, పేదవాడు తలెత్తుకుని గౌరవంగా బతకడానికి మనసున్న ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. వాటిని వృథా అనటానికి నోరు ఎలా వచ్చిందని వైసీపీ ఎంపీలు దుయ్యబట్టారు. అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు ఓ వర్గం ప్రయోజనాల కోసం ప్రాకులాడుతున్నారే తప్పితే.. అందులో రాష్ట్ర ప్రయోజనాలు లేవని చెప్పారు.