ఏపీలోని అధికార వైఎస్ఆర్పీపీ నేటితో 12 వసంతాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్నాయి. అన్ని నియోజకవర్గాలలో పార్టీ జెండాలు ఎగురవేయాలని, పలు సేవా కార్యక్రమాలతో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధిష్టానం నేతలకు పిలుపునిచ్చింది. పలు సేవా కార్యక్రమాలతో వేడుకలు ఘనంగా నిర్వహించాలని సూచించింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు ఘనంగా నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు హాజరవుతున్నారు.
Also Read:MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. రేపే పోలింగ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వేసిన ముద్ర అంతా ఇంతా కాదు. దివంగత సీఎం వైఎస్ మరణంతో అంధకారంలోకి నెట్టబడిన రాష్ట్రాన్ని వెలుగు బాటలో నడిపించాలని వైయస్సార్సీపీని ప్రారంభించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2011 మార్చి 12న ప్రారంభించిన పార్టీ పన్నెండేళ్లు పూర్తి చేసుకుని, 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. విపత్కర పరిస్థితుల్లో పార్టీ ఏర్పాటు చేసి.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చే వరకూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు వైయస్ జగన్. 2019 ఎన్నికల్లో కొత్త చరిత్రనే సృష్టించారు. 16 నెలల జైలు జీవితం.. ఏడాదిన్నరకు పైగా పాదయాత్ర.. తొమ్మిదేళ్ల పోరాటాల ఫలితమే ముఖ్యమంత్రిగా జగన్ కు అవకాశం లభించింది. తండ్రి మరణం తరువాత మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్ ను వీడిన జగన్ తొలిగా తన తల్లితో కలిసి రాజకీయంగా అడుగులు వేసారు. తండ్రి తరహాలో ప్రజాభిమానం నిలుపుకోవటంలో విజయవంతం అయ్యారు.వైఎస్ జగన్ నేతృత్వంలో ఎన్నో సవాళ్లను అధిగమించి, సంపూర్ణ ప్రజా బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తనను గెలిపించిన ఓటర్లకు ప్రాధాన్యత ఇస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకొనేందుకు సీఎంగా జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.