కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుని.. సీఎం యడియూరప్ప కాస్త మాజీ సీఎం అయిపోయారు.. ఇక, ఆయన కుమారుడికి డిప్యూటీ సీఎం లేదా కేబినెట్‌లో చోటు దక్కుతుందని భావించినా.. అది కూడా సాధ్యపడలేదు.. అయితే, కర్ణాటక ప్రభుత్వం తాజాగా యడియూరప్పకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. కానీ, ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర సర్కార్‌కు విజ్ఞప్తి చేశారు మాజీ సీఎం యడియూరప్ప.. కేవలం మాజీ ముఖ్యమంత్రికి ఉండే సదుపాయాలు, భద్రత మాత్రమే తనకు కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ సీఎం బసవరాజ్ బొమ్మైకి లేఖ రాయడం చర్చగా మారింది.
కాగా, కర్ణాటకలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకున్న యడియూరప్ప.. సీఎంగా బసవరాజ్ బొమ్మైని సిఫార్సు చేశారు.. దీంతో గత నెల 28న సీఎంగా బాధ్యతలు స్వీకరించారు బసవరాజ్ బొమ్మై.. ఇక, తాజాగా మాజీ సీఎం యడియూరప్పకు కేబినెట్ ర్యాంకు కలిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.. కానీ, ఆ ప్రతిపాదనలను తిరస్కరించారు యడియూరప్ప.. దీనిపై కొత్త సీఎంకు లేఖ రాశారు. కర్ణాటకలో తాజాగా ఏర్పాటైన కేబినెట్‌లో కొంతమంది మంత్రులు తమకు కేటాయించిన శాఖలపై అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వస్తుండగా.. మరోవైపు.. తన కుమారుడికి పదవి దక్కుతుందని ఎదురుచూసిన యడియూరప్పకు తీవ్ర నిరాశే ఎదురుదైంది.. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం కేటాయించిన కేబినెట్ హోదా తనకు వద్దంటూ ఆయన లేఖ రాయడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారిపోయింది.