ఢిల్లీలో బుధవారం హోలీ వేడుకల సందర్భంగా జపాన్‌కు చెందిన ఓ యువతిపై కొందరు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించారు. కొందరు వ్యక్తులు ఆమెని పట్టుకుని వేధించి, అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో తీవ్ర దుమారం రేగింది. హోలీ హై అంటూ బాధిత యువతిని పట్టుకోవడం, ఆమెపై రంగులు జల్లడం చేశారు. ఒక బాలుడు ఆమె తలపై గుడ్డు పగులగొట్టాడు. దీంతో బాధితురాలు ఆ గుంపు నుండి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే, ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని ఆమె చెంపదెబ్బ కొట్టింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: Delhi liquor policy case: ఈడీ కస్టడికి మనీశ్ సిసోడియా
ఈ ఘటన పహర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కొత్తదా లేదా పాతదా అన్నదానిపై విచారణ చేస్తున్నారు. యువతికి సంబంధించిన మరేదైనా వివరాల కోసం జపాన్ రాయబార కార్యాలయానికి ఈ-మెయిల్ పంపించామని పోలీసులు చెప్పారు. వీడియోలో ఉన్న యువకుల కోసం గాలిస్తున్నారు. వీడియో నిజమే అయితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, హోలీ పండుగని ఢిల్లీతోపాటు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో బుధవారం జరుపుకున్నారు. చాలా రాష్ట్రాలు ముందురోజు హోలీని జరుపుకున్నాయి.
Also Read: TV Rama Rao Resigns YSRCP: వైసీపీకి షాక్..! పార్టీకి మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై..
