(ఆగష్టు 28న సుమన్ పుట్టినరోజు)
నవలానాయకునిగా ఆ రోజుల్లో రచయితలు వర్ణించిన తీరుకు అనుగుణంగా ఉండే రూపం హీరో సుమన్ సొంతం. ఆరడుగులకు పైగా ఎత్తు, పసిమి మేని ఛాయ, కోటేరు ముక్కు, ముఖంపై చెరగని కాంతి, సదా చిరునవ్వులు చిందే పెదాలు… ఇలా నవలానాయకుల వర్ణనలు సాగేవి. అందుకు తగ్గ రూపంతో ఉన్న సుమన్ ఇట్టే చూపరులను ఆకట్టుకొనేవారు. అందుకే పెద్దగా శ్రమించకుండానే హీరోగా అవకాశాలు లభించాయి. తొలుత తమిళంలో తడాఖా చూపిన ఈ కరాటే మాస్టర్, తరంగిణి
తెలుగు చిత్రంతో మన జనం ముందు నిలిచారు. తొలి చిత్రంతోనే స్వర్ణోత్సవం చూసిన హీరోగా గుర్తింపు సంపాదించారు. ఆ తరువాత తనదైన యాక్షన్ తో ఫైట్స్ చేస్తూ తెలుగువారిని విశేషంగా ఆకట్టుకున్నారు. ఆ రోజుల్లో సుమన్ లాంటి మొగుడు కావాలని ఎందరో అమ్మాయిలు అభిలషించారు. హీరోగా సక్సెస్ చూసినంత కాలం కథానాయక పాత్రల్లోనే అలరించారు. నాయక పాత్రల్లో పరాజయాలు పలకరించగానే తెలివిగా కేరెక్టర్ రోల్స్ లోకి మారిపోయారు సుమన్. యన్టీఆర్ తరువాత ఈ తరంలో బాలకృష్ణ ఒక్కరే పౌరాణిక పాత్రల్లో అలరిస్తూ సాగారు. బాలయ్య చెంతన తన పేరునూ నమోదు చేసుకుంటూ సుమన్ శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీరాముడు వంటి పౌరాణిక పాత్రల్లో అలరించారు. ఇప్పుడు తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేసే ప్రయత్నంలో సాగుతున్నారు సుమన్.
కన్నడనాట పుట్టి, తమిళనాట అడుగుపెట్టి, తెలుగు చిత్రాలలో స్టార్ హీరో స్టేటస్ చూశారు సుమన్. ఆయన మాతృభాష తుళు. ఆ భాషలో ద్రవిడ భాషల్లోని పదాలు చోటు చేసుకుంటాయి. అందువల్ల సుమన్ కు తెలుగు, తమిళ భాషల్లో ఇట్టే పట్టు సాధించారు. అనేక తమిళ చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించారు సుమన్. కొన్ని చిత్రాలలో యంగ్ విలన్ గానూ మెప్పించారు. నిజానికి సుమన్ తెలుగులో నటించిన తొలి చిత్రం ఇద్దరు కిలాడీలు
. తన మిత్రుడు భానుచందర్ తో కలసి ఇందులో నటించారు. ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ, రేలంగి నరసింహారావు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా ఆలస్యంగా విడుదలయింది. తరంగిణి
లోనూ భానుచందర్ తో కలసి నటించారు సుమన్. ఆ సినిమా ఘనవిజయం తరువాత కొంతకాలం సుమన్, భానుచందర్ నటించిన చిత్రాలు జనాన్ని పలకరించాయి. టి. కృష్ణ దర్శకత్వంలో విజయశాంతి ప్రధాన పాత్ర పోషించిన నేటి భారతం
సినిమా సుమన్ కెరీర్ ను పెద్ద మలుపు తిప్పింది. ఈ సినిమా సైతం ఘనవిజయం సాధించింది. దాంతో సుమన్ మరి వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు చిత్రాలపైనే దృష్టిని కేంద్రీకరించి సాగారు. సుమన్ హీరోగా రూపొందిన పండంటి కాపురానికి 12 సూత్రాలు, సితార, న్యాయం మీరే చెప్పాలి, దర్జాదొంగ, దేశంలో దొంగలు పడ్డారు, మెరుపుదాడి
వంటి చిత్రాలతో మంచి విజయాలు చూశారు. సుమన్ కెరీర్ సజావుగా సాగుతున్న సమయంలో ఆయనపై ఓ అపవాదు పడింది. అమ్మాయిలను ఏడ్పించి, మరీ నీలిచిత్రాలలో నటింప చేశారనే అబియోగంపై సుమన్ అరెస్టయ్యారు. చేయని నేరానికి శిక్ష అనుభవించారు. తరువాత కాట్రగడ్డ ప్రసాద్ నిర్మించిన బందిపోటు
తో మరోమారు జనం ముందునిలిచారు. నేరం నాది కాదు, ఖైదీ ఇన్ స్పెక్టర్, 20వ శతాబ్దం, పెద్దింటి అల్లుడు, అలెగ్జాండర్, బావ-బావమరిది
వంటి హిట్ మూవీస్ లో నటించారు. బావ-బావమరిది
చిత్రంతో సుమన్ కు ఉత్తమ నటునిగా నంది అవార్డు సైతం లభించింది. కొండపల్లి రాజా
లో వెంకటేశ్ మిత్రునిగా నటించి అలరించిన సుమన్ తరువాత అబ్బాయిగారి పెళ్లి, ఓసి నా మరదలా, బంగారుమొగుడు, ప్రియమైన శ్రీవారు, ఏమండీ పెళ్ళి చేసుకోండి
వంటి చిత్రాలలో హీరోగా నటించారు. కొన్ని అలరించాయి, మరికొన్ని అపజయాన్ని చూపాయి. ఆ సమయంలోనే కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున అన్నమయ్య
గా నటించిన చిత్రంలో శ్రీవేంకటేశ్వర స్వామి పాత్ర పోషించే అవకాశం లభించింది.అదే తన జీవితంలో మరపురాని సంఘటన అంటారు సుమన్. ఆ తరువాత రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్ లోనే తెరకెక్కిన శ్రీరామదాసు
లో శ్రీరామునిగానూ అలరించారాయన. అలా తన దరికి చేరిన పాత్రల్లో నటిస్తూ సాగుతున్నసమయంలో రజనీకాంత్ తో శంకర్ తెరకెక్కించిన తొలి చిత్రం శివాజీ
లో సుమన్ విలన్ గా తనదైన బాణీ పలికించారు. అప్పటి నుంచీ కేరెక్టర్ రోల్స్ లో వైవిధ్యం చూపిస్తూ సాగుతున్నారు సుమన్.
తెలుగులో యన్టీఆర్ అంటే ఎంతగానో అభిమానించే సుమన్ కు ఆయన మరణం తరువాత ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీపై అభిమానం కలిగింది. 1999లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలో చేరారు. తరువాత కొన్నాళ్లకు 2004లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచీ అదే పార్టీలో కొనసాగుతున్నారు. ప్రముఖ రచయిత డి.వి.నరసరాజు కూతురు కుమార్తె అయిన శిరీషను వివాహమాడారు సుమన్. వారికి ఓ అమ్మాయి. ఆ మధ్య సుమన్ కూతురు ప్రత్యూష నాట్యంలో ప్రావీణ్యం సంపాదించి అరంగేట్రం కూడా చేశారు. ఇప్పటికీ సుమన్ ను ఆ నాటి అభిమానులు అందాల కథానాయకునిగానే ఆరాధిస్తున్నారు. తన దరికి చేరే అభిమానులతో ఎంతో సఖ్యంగా ఉండే సుమన్ వారి అభిమానమే తాను సంపాదించుకున్న అసలైన ఆస్తి అంటూ ఉంటారు.