లాక్ డౌన్ తొలగింది. టాలీవుడ్ లో షూటింగ్ ల సందడి మొదలైంది. ఇది ఓ వైపు చిత్రం… మరో వైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో అంతర్గతంగా ఎన్నికల హడావుడి కూడా ఆరంభం అయంది. రెండేళ్ళకోసారి జరిగే మా ఎన్నికలు ఈ సారి కూడా రసవత్తర పోరుకు తెరతీయబోతున్నాయి. ప్రస్తుత కమిటీ కాలపరిమితి ముగిసినా… కరోనా వల్ల ఈ సారి కొత్త కమిటీ ఎంపిక ఆలస్యం అయింది. లాక్ డౌన్ తొలిగిన నేపథ్యంలో మళ్ళీ ‘మా’లో ఎన్నికల చిచ్చు ఆరంభం అయింది.
ఈ సారి ‘మా’ అధ్యక్షుడు ఎవరు?
ఈ సారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఎంపిక అయ్యేది ఎవరు? అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. అయితే ఇప్పటికే ప్రకాశ్ రాజ్ తను అసోసియేషన్ అధ్యక్షుడుగా పోటీ చేస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ప్రకటించి ఉన్నారు. ఆయన ప్యానెల్ గా పోటీ చేస్తారా? లేక అధ్యక్ష స్థానానికే పరిమితం అవుతారా? అన్నది తేలాల్సి ఉంది. ఇక మంచు విష్ణు కూడా రంగంలోకి దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరు కాకుండా గత కమిటీలో కార్యదర్శిగా ఉన్న జీవిత కూడా ఈసారి అధ్యక్ష స్థానంపై కన్నేసినట్లు సమాచారం. అలాగే గతంలో అధ్యక్షుడుగా పోటీచేసిన శివాజీరాజా కూడా మరోసారి అధ్యక్షుడు కావాలనుకుంటున్నారట.
పోటీ అనివార్యమా!?
నిజానికి చిత్రపరిశ్రమ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ‘మా’ అధ్యక్షుడుని ఏకగ్రీవంగా ఎంపిక చేస్తే ఎంతో మేలు జరుగుతుంది. చిరంజీవి వంటి పెద్దలు ఆ దిశగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కానీ ‘మా’ అధ్యక్షుడు అనే పదవి అందరినీ ఊరిస్తోంది. అందుకే ఏకగ్రీవం అనేది జరగని పని అంటున్నారు.
మెగా మద్దతు ఎవరికి?
‘మా’ ఎన్నికలలో గత కొంత కాలంగా చిరువర్గం మద్దతు ఎవరివైపు ఉంటే వారికి అధ్యక్షపీఠం దక్కుతూ వస్తోంది. అంతే కాకుండా కరోనా కష్టకాలంలో చిరంజీవి ఆపద్భాందవుడుగా అందరినీ ఆదుకోవడం కూడా ఆయన మాటకు ఎదురు లేకుండా ఉంటుందనటంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ‘చిరంజీవి మద్దతు మీకు ఉందా?’ అనే ప్రశ్న ప్రకాశ్ రాజ్ కి ఎదురైనపుడు… ‘ఆయన అందరివాడు. వ్యక్తిగతంగా ఏ ఒక్కరికో మద్దతు ఇవ్వరు. మంచి చేస్తారని భావించిన వారికి ఆయన మద్దతు ఉంటుంది’ అనేశారు. అయితే చిరు తమ్ముడు నాగబాబు మాత్రం ప్రకాశ్ రాజ్ అధ్యక్షుడుగా నియమితుడైతే తెలుగు చిత్రపరిశ్రమకు మంచి జరుగుతుందన్న నమ్మకం ఉందని వ్యాఖ్యానించటమే కాదు ఎన్నికలలో మద్దతు కూడా ఉంటుందనేశారు.
దీంతో మెగా మద్దతు ప్రకాశ్ రాజ్ వైపే ఉందని స్పష్టం అవుతోంది. అయితే ఇప్పుడు రంగంలోకి మంచు విష్ణు దిగటం ఆసక్తిని రేకెత్తించే అంశం. విష్ణు తండ్రి మోహన్ బాబు చిరు మిత్రుడు కావటంతో ఆ వైపు నుంచి నరుక్కు వస్తారనే వారు లేక పోలేదు. కానీ గతంలో ‘మా’కి ప్రకాశ్ రాజ్ మధ్య నడిచిన వివాదంను ఇప్పుడు ఎవరైనా ఎత్తి చూపే అవకాశం ఉందంటున్నారు మరి కొందరు. ఎందుకంటే ఇలాంటివన్నీ ఎన్నికలప్పుడే బయటపడుతుంటాయి మరి. తెలుగువాడైన విశాల్ నడిగర్ సంఘం అధ్యక్షుడుగా ఎంపిక అయినట్లే… ప్రకాశ్ రాజ్ ‘మా’ అధ్యక్షుడుగా ఎన్నికకావటంలో అంత పట్టింపు ఉండకపోవచ్చు. ఏది ఏమైనా ‘మా’ ఎన్నికలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్.