NTV Telugu Site icon

Maharashtra: ఆరు నెలల్లోనే భారీ మార్పు.. “మహాయుతి” విజయంలో ఆర్‌ఎస్ఎస్ పాత్ర ఏంటి?

Rss

Rss

మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘనవిజయం రాష్ట్ర రాజకీయ సమీకరణాలను తలకిందులు చేసింది. బీజేపీ, దాని మిత్రపక్షాల సునామీలో ఇతర పార్టీలు కొట్టుకుపోయాయి. బీజేపీ, ఎన్సీపీ, షిండే సేన కూటమి 288 స్థానాలకు గాను 235 స్థానాలను కైవసం చేసుకుంది. మహావికాస్ అఘాడీ కేవలం 50 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మహావికాస్ అఘాడీ పార్టీల పరిస్థితి స్వతంత్ర అభ్యర్థుల కంటే తక్కువగానే మిగిలిపోయింది.

కాగా..ఆరు నెలల క్రితం, లోక్‌సభ ఎన్నికల సమయంలో మొత్తం మహారాష్ట్ర వాతావరణం మహావికాస్ అఘాడీకి అనుకూలంగా కనిపించింది. మరాఠ్వాడాలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో ఆరింటిలో మహాయుతి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆరు నెలల్లోనే 46 అసెంబ్లీ స్థానాల్లో 41 స్థానాలను మహాయుతి కైవసం చేసుకుంది. ఇందులో బీజేపీ ఖాతాలో 19, శివసేన ఖాతాలో 13, ఎన్సీపీ ఖాతాలో 8 సీట్లు వచ్చాయి.

మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడి ప్రభావం..
ఈ నాటకీయ మార్పు వెనుక అనేక కారణాలున్నాయి. మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరంగే ఉద్యమం కారణంగా లోక్‌సభ ఎన్నికల్లో మహాయుతి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే మనోజ్ జరంగే ఫ్యాక్టర్ ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఆ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించారు. ఆయన వర్గానికి చెందిన పదుల సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో పరిస్థితి తారుమారైంది.

నాందేడ్ జిల్లాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌కు మంచి పట్టు..
సంస్కరణల కోసం బీజేపీ సోషల్ ఇంజినీరింగ్‌ను ఆశ్రయించింది. మరాఠ్వాడాలోని లాతూర్, ఉస్మానాబాద్, నాందేడ్ జిల్లాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌కు మంచి పట్టు ఉందని రాజకీయ నిపుణుడు తెలిపారు. ఇది కాకుండా, మత పెద్దలు కూడా అనేక జిల్లాలలో కమాండ్ తీసుకొని హిందూ ఓటర్లను పోలరైజ్ చేయడం ప్రారంభించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓబీసీ ఓట్లు కూడా మహాయుతి వైపు మళ్లాయి. అయితే నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

ఠాక్రే కుటుంబానికి చెందిన దశాబ్దాల నాటి కోట కూలింది..
విదర్భలో కూడా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 62 స్థానాలకు గాను 39 స్థానాలను మహాయుతి కైవసం చేసుకుంది. ఇక్కడ కాంగ్రెస్ చాలా నష్టపోయింది. కొంకణ్ బెల్ట్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లోని ఠాక్రే కుటుంబానికి చెందిన దశాబ్దాల నాటి కోట కూలిపోయింది. ఇక్కడ ఉద్ధవ్ ఠాక్రే సైన్యం 39 స్థానాలకు గానూ ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. మహాయుతి 35 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక్క ఆర్‌ఎస్‌ఎస్‌కి మంచి పట్టు ఉంది. అనేక మంది స్వయం సేవకులు శ్రమించారు.

పశ్చిమ మహారాష్ట్రలో 70 స్థానాలకు గాను 53 స్థానాలు..
పశ్చిమ మహారాష్ట్రలో 70 స్థానాలకు గాను 53 స్థానాల్లో మహాయుతి విజయం సాధించింది. మహావికాస్ అఘాడికి 12 సీట్లు మాత్రమే వచ్చాయి. కొల్హాపూర్ జిల్లాలోని మొత్తం 10 స్థానాలను మహాయుతి కైవసం చేసుకుంది. ఉత్తర మహారాష్ట్రలో జరిగిన ఆరు లోక్‌సభ ఎన్నికల్లో నాలుగింటిలో మహాయుతి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే ఈసారి ఒక్కసారిగా ఓటు మహాయుతి వైపు మళ్లింది. ఈ ప్రాంతంలో నారాయణ్ రాణే ప్రభావం కనిపించింది. శివసేన, ఎన్సీపీ విడిపోవడంతో ఓట్లు కూడా మహాయుతి వైపు మళ్లాయని నిపుణులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో, విచ్ఛిన్నమైన పార్టీల మద్దతు స్థావరం వేగంగా క్షీణించింది.

సరైన వ్యూహాలతో ఆర్‌ఎస్ఎస్..
హారాష్ట్ర ఎన్నికల సమరంలో ఒక సమయంలో ఎన్డీయే బాగా వెనుకబడింది. కూటమికి ఓటమి తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే గ్రౌండ్ లెవల్ రియాలిటీని అర్థం చేసుకున్న ఆర్‌ఎస్ఎస్.. సరైన వ్యూహాలతో కదనరంగంలోకి దూకి జోరు పెంచింది. పక్కా ప్లానింగ్‌తో ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసి సక్సెస్ అయింది. తమకు పట్టు ఉన్న పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ జోరుగా ప్రచారం చేసింది. దీంతో నెల రోజుల కింద వరకు వెనుకబడిన ఎన్డీయే ఒక్కసారిగా పుంజుకుంది. సాధారణంగా మన దేశంలో పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు ఉదాసీనతతో ఉంటారు. ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపించరు. పట్టణ ప్రాంతాల్లో నమోదయ్యే ఓటు శాతమే దీనికి పెద్ద ఉదాహరణ. కానీ దీన్నే క్యాష్ చేసుకోవాలని ఆర్ఎస్ఎస్ నిర్ణయించుకుంది.

శ్రమించిన సంఘ్ కార్యకర్తలు..
ముంబై, పూణె, నాగ్‌పూర్‌తో పాటు ఇతర పట్టణాలను టార్గెట్ చేసుకొని సంఘ్ కార్యకర్తలు గత నెల రోజులు జోరుగా ప్రచారం చేశారు. సుస్థిర ప్రభుత్వాలతో వేగంగా అభివృద్ధి జరుగుతుందని, ఎన్డీయే కూటమితోనే అది సాధ్యమని చెబుతూ పట్టణ ఓటర్ల మనసులు గెలుచుకునేందుకు ప్రయత్నించారు. ఇంటింటికీ ప్రచారం చేస్తూ కమ్యూనిటీ మీటింగ్స్ కూడా నిర్వహించారు. ఓటు ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఇల్లు దాటి పోలింగ్ కేంద్రాలకు తరలేలా చేయగలిగారు. గ్రామాల్లోనూ బీజేపీకి బలమైన క్యాడర్ ఉండటంతో వాళ్ల సాయంతో ప్రచారం హోరెత్తించింది ఆర్ఎస్ఎస్.

ఆర్ఎస్ఎస్ అమలు చేసిన వ్యూహాలతో ఫలితాలు..
ఆర్ఎస్ఎస్ చేసిన ప్రయత్నాలు బాగా సక్సెస్ అయ్యాయి. పట్టణ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగడమే దీనికి బిగ్ ఎగ్జాంపుల్. గ్రామాలతో పాటు పట్టణ, మధ్యతరగతి ఓటర్లను మహాయుతి కూటమి వైపు మొగ్గేలా చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. అందుకే ఇంత భారీ విజయాన్ని సాధించింది ఎన్డీయే. కొన్ని వారాల కింద సంఘ్ గనుక అలర్ట్ కాకపోయి ఉంటే రిజల్ట్ ఇలా ఉండేది కాదని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఆర్ఎస్ఎస్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన ప్రచారం, అమలు చేసిన వ్యూహాలతో ఫలితాలు తారుమారు అయ్యాయి.