పంజాబ్ రాష్ట్రంలో ఎట్టకేలకు ముఖ్యమంత్రిని మార్చేశారు. గత కొంతకాలంగా ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తలెత్తాయి. సిద్ధూ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక కాకముందు నుంచే కెప్టెన్‌కు, సిద్ధూకు మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే, సిద్ధూ చాలా కాలం క్రితం నుంచి తనను తాను సీపీపీ అధ్యక్షుడిగా చెప్పుకుంటూ వచ్చారు. భవిష్యత్తులో తన నేతృత్వంలోనే పంజాబ్ కాంగ్రెస్ నడుస్తుందని పేర్కొన్నాడు. దానికి తగినట్టుగానే కాంగ్రెస్ అధిష్టానం వద్ధ పావులు కదిపారు. పైగా రాహుల్‌గాంధీకి, ప్రియాంక గాంధీకి సిద్ధూకి మధ్య మంచి సంబంధాలు ఉండటంతో ఆయన్ను వారు ప్రోత్సహించారు. దీంతో పంజాబ్ కాంగ్రెస్ లో అసమ్మతి మొదలైంది. సోనియా గాంధీకి కెప్టెన్‌ను మార్చాలనే ఉద్దేశం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో రాహుల్ నిర్ణయానికి ఓకే చెప్పక తప్పలేదు. దీనిద్వారా రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలపై అధిష్టానానికి పూర్తి పట్టు ఉందని చెప్పకనే చెప్పారు. పంజాబ్ ప్రభావం రాజస్థాన్, చత్తీస్‌గడ్‌పై పడనుందా అంటే పరిస్థితులు అవుననేలాగా ఉన్నాయి. రాజస్థాన్‌లో పైలట్ వర్గానికి, ముఖ్యమంత్రి గెహ్లాట్ వర్గానికి పోసగడం లేదు. పైలట్ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకుంటే రాబోయే రోజుల్లో రాజస్థాన్‌లోనూ అసమ్మతి మొదలయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇటు చత్తీస్‌గడ్ లో కూడా ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌కు ఆరోగ్యశాఖ మంత్రి సింగ్‌దేవ్‌కు పడటం లేదు. ఇద్దరూ చెరోసగం కాలం ముఖ్యమంత్రులుగా చేయాలని ఒప్పందం జరిగినా దానిని బఘేల్ పట్టించుకోకపోవడంతో అక్కడ కూడా అదేవిధంగా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి.
ఆ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ముఖ్యమంత్రులను మారుస్తుందా?
