జోరున పడుతున్న వానలతో ఉత్తరాంధ్రలోని రిజర్వాయర్లు నిండిపోయాయి. విజయనగరం జిల్లా తాటిపూడి రిజర్వాయర్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.. ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది.. ఎప్పుడు ఏమౌతుందో అని ప్రజల్లో ఆందోళన నెలకొంది. గంట్యాడ మండలం గోస్తనీ నదిపై తాటిపూడి వద్ద నిర్మించిన రిజర్వాయర్ కు భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. విశాఖ ఏజెన్సీ అరకు అనంతగిరి ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు దిగువకు నీరు వచ్చి చేరడంతో తాటిపూడి రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 297 అడుగులు కాగా గరిష్ట నీటిమట్టం మించి ప్రవహించడంతో నీటి ఉధృతి ఎక్కువైంది. దీంతో గేట్ల పైనుంచి నీరు ప్రవహిస్తోంది.
గేట్లపై నుండి నీరు ప్రవహిస్తున్నా జలవనరుల శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ వుండడంతో సర్వత్రా ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా 295 అడుగులకు నీరు చేరుకోగానే గేట్లను కొంతమేరలేపి వరదనీటిని తగ్గించే అవసరం ఉంది. కానీ నేడు 297 అడుగులు దాటి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నా కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిని చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.
ఇంతటి ప్రమాదకర పరిస్థితులలో తాటిపూడికి నిత్యం వస్తున్న పర్యాటకులతో కిక్కిరిసిపోతోంది. తాటిపూడికి ఈ కార్తీక మాసంలో సందర్శకులు తాకిడి కూడా అధికంగా ఉంటుంది. సందర్శకులు ప్రమాదాలకు గురికాకుండా చూడవలసిన పోలీసులు కూడా కనీసం కనిపించడంలేదు. ఉన్నతాధికారులు స్పందించి.. తగు ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదాలు జరగకముందే తగిన హెచ్చరికలు జారీచేయాలని వారు సూచిస్తున్నారు.