NTV Telugu Site icon

చెడ్డీ గ్యాంగ్ కేసులో పురోగతి..

విజయవాడలో చెడ్డీ గ్యాంగ్‌ ఈ మధ్య కలకలం సృష్టిస్తోంది… విజయవాడ, అమరావతి, తాడేపల్లి ప్రాంతాల్లో పలు చోట్ల చోరీలకు పాల్పడింది చెడ్డీ గ్యాంగ్.. దీంతో రంగంలోకి దిగిన బెజవాడ పోలీసులు… ఈ కేసులో పురోగతి సాధించారు.. రెండు గ్యాంగ్‌లకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.. చెడ్డీ గ్యాంగ్ చోరీ ఘటనల సీసీటీవీ ఫుటేజీని గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కూడా పంపించారు బెజవాడ పోలీసులు. తాడేపల్లి చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలోని చెడ్డీ గ్యాంగ్ సభ్యులను గుజరాత్‌ పోలీసులు గుర్తించినట్టుగా పోలీసులు చెబుతున్నారు.. గుజరాత్‌లోని దాహోద్ ప్రాంతానికి చెందిన గ్యాంగ్‌గా గుర్తించారు.. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లి రెండు చెడ్డీ గ్యాంగ్‌లకు సంబంధించిన నలుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు బెజవాడ పోలీసులు..

ఈ వ్యవహారంలో దాహోద్ ఎస్పీతో మాట్లాడారు బెజవాడ సీపీ రాణా… ఇక, గుజరాత్ రాష్ట్రానికి చేరుకున్న ఏపీకి చెందిన రెండు పోలీస్ బృందాలు.. నలుగురిని అదుపులోకి తీసుకున్నాయి. మొత్తంగా కొంత కాలంగా బెజవాడ, పరిసర ప్రాంతవాసులను భయాందోళనకు గురిచేస్తున్న చెడ్డీ గ్యాంగ్‌ పనిపట్టేందుకు పూనుకున్నారు విజయవాడ పోలీసులు. కాగా, కొంతకాలంగా ఈ గ్యాంగ్‌ కదలికలు కనిపించకపోయినా ఇటీవల కాలంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో వీరు నేరాలకు పాల్పడిన ఘటనలు వెలుగుచూడటంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. వీరిని పట్టుకునేందుకు పోలీసు అధికారులు అన్ని జిల్లాల్లోనూ జల్లెడ పడుతూ. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ గ్యాంగ్‌ జిల్లాలో ఇప్పటికే ప్రవేశించిందా అన్న అనుమానంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసి గస్తీ పెంచారు. ఇలా మొత్తంగా పురోగతి సాధించారు.