దీపావళి పండుగ నేపథ్యంలో దేశ ప్రజల కోసం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సందేశాన్ని ఇచ్చారు. ఇంటికి, సమాజానికి, జగతికి వెలుగులు పంచే దీపోత్సవమైన దీపావళి పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు వెంకయ్య నాయుడు.
భారతదేశంలో ప్రతి పండుగ, మన సంస్కృతిని మనకు గుర్తుచేస్తుందని… మర్యాదా పురుషోత్తముడైన శ్రీ రామచంద్రుడు 14 ఏళ్ల వనవాసం తర్వాత సీత, లక్ష్మణ సమేతంగా అయోధ్యకు విచ్చేసిన శుభ సందర్భాన్ని దీపావళిగా జరుపుకుంటామని తెలిపారు. భారతీయ సంస్కృతిలోని సత్యం, ధర్మం, న్యాయం, దయ, కరుణల మూర్తిత్వమే శ్రీరామ చంద్రుడని తెలిపారు.
శ్రీరామ చంద్రుడి జీవిత ఆదర్శాల స్ఫూర్తితో, చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా దీపావళి జరుపుకోవడం మన సంప్రదాయమని తెలియజేశారు. సమృద్ధికి సంకేతమైన లక్ష్మీదేవిని ఆరాధించడం కూడా దీపావళి పండగ విశిష్టత అని పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శ్రీరామచంద్రుడి అయోధ్య ఆగమనం, లక్ష్మీదేవి కరుణా కటాక్షాల కోసం జరుపుకునే ఈ పండుగ మీ అందరి జీవితాల్లో సంపూర్ణ సమృద్ధిని తీసుకురావాలని, సరికొత్త ముందడుగుకు మార్గదర్శనం చేయాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ… శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు వెంకయ్యనాయుడు.
