ఇప్పటికే కరోనా డెల్టా వేరియంట్‌లతో అతలాకుతలమవుతున్న ప్రపంచ దేశాలు.. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఒమిక్రాన్‌ను అడ్డుకునేందుకు ఇప్పటికే వివిధ దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. అంతేకాకుండా ఒమిక్రాన్‌పై దృష్టి సారించి ముందస్తు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో కూడా తాజాగా రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
ఒమిక్రాన్ సోకిన ఇద్దరు కర్ణాటకలోని బెంగూళూరు ఎయిర్‌పోర్టులో నవంబర్ 11న ఒకరు, నవంబర్ 20 మరొకరు దిగారు. వారి వయసు 64, 46 ఏళ్లు అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్ సోకినవారిలో తీవ్ర లక్షణాలు లేవని వెల్లడించారు. అంతేకాకుండా ఒమిక్రాన్ సోకినవారి ప్రైమరీ కాంటాక్ట్స్‌ను ట్రేస్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.