NTV Telugu Site icon

శ్రీశైలానికి అమిత్‌షా… టూర్‌ సాగనుంది ఇలా..

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ ఏపీకి రానున్నారు. శ్రీశైలం ఆలయంలో షా పూజలు చేయనున్నారు. ఉదయం 9 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి తొలుత హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. 11.15 గంట‌ల‌కు బేగంపేట విమానాశ్రయానికి., అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీ‌శైలానికి వెళ్లనున్నారు. మ‌ధ్యాహ్నం 12.25కు కర్నూలు శ్రీశైలంలోని సున్నిపెంట‌కు అమిత్ షా చేరుకుంటారు. అనంతరం శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల దర్శనం చేసుకుంటారు. మధ్యాహ్నం 2.45 గంటలకు శ్రీశైలం నుంచి హెలికాప్టర్‌లో తిరిగి హైద‌రాబాద్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లిపోతారు.

లోక్ సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన మరుసటిరోజే అమిత్ షా శ్రీశైలం వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. నల్లమల అటవీప్రాంతం కావడంతో అమిత్ షా రాక సందర్బంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర హోం మంత్రి రాక సందర్భంగా అటు ఏపీ, ఇటు తెలంగాణలోనూ అంతర్గతంగా అలర్ట్ కొనసాగుతోంది. అమిత్ షాతో పాటుగా శ్రీశైలం ఆలయానికి ఆయన కుటుంబీకులు కూడా వస్తున్నారు. అయితే, హోం మంత్రి పర్యటనలో రాజకీయ కలయికలు ఉంటాయా అనేది ఉత్కంఠ రేపుతోంది.