కరోనా మహమ్మారి కేసులు ఇంకా పెద్ద సంఖ్యలోనే వెలుగు చూస్తున్నాయి.. ఫస్ట్ వేవ్ కంటే.. సెకండ్ వేవ్‌లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అవ్వడమే కాదు.. మృతుల సంఖ్య కూడా పెరిగిపోయింది.. అయితే, దీనికి కారణం.. ఫస్ట్ వేవ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత.. ప్రజలు లైట్‌గా తీసుకోవడమే కారణం అని పలు సందర్భాల్లో నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు సెకండ్ వేవ్ కేసులు తగ్గుతూ వస్తున్నా.. ఇంకా భారీగానే కేసులు నమోదు అవుతున్నాయి.. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో మరో మూడు నెలల పాటు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో కరోనా మహమ్మారి మరింతగా విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరించిన ఆరోగ్యశాఖ.. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమ్మిగూడే చోట దూరంగా ఉండాలని.. కరోనా బారినపడకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపింది. దేశంలో ఇప్పటికీ రోజుకు దాదాపు 20 వేల పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న విషయాన్ని కూడా గుర్తుచేస్తున్నారు ఆరోగ్యశాఖ అధికారులు.
అయితే, ఈ మూడు నెలల పాటు జాగ్రత్తగా ఉండకపోతే కరోనా మహమ్మారి మరింతగా విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్యశాఖ అధికారులు.. ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అంతా జాగ్రత్తగా ఉండకపోతే.. కరోనా వైరస్ పరిస్థితి అవాంఛనీయ మలుపు చోటుచేసుకొనే అవకాశం ఉందని.. దాని బారినపడకుండా ఉండేందుకు ఈ 3 నెలల పాటు అప్రమత్తంగా ఉండాలని.. జన సమూహాలకు దూరంగా ఉంటూనే.. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని.. వీలైతే వేడుకలను వర్చువల్‌గా జరుపుకోవడం, ఇంట్లోనే ఉండటం, ఆన్‌లైన్ షాపింగ్‌లకు ప్రాధాన్యమివ్వడం వంటి చర్యలకు పూనుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కీలక సూచనలు చేశారు.