Site icon NTV Telugu

హైదరాబాద్ లో అమానుషం.. కులాంతర వివాహం చేసుకున్నారని..

కులాలు, మతాలు అనే తేడా లేకుండా నివసిస్తోన్న హైదరాబాద్ నగరంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. దళిత మహిళను కులాంతర వివాహం చేసుకున్నందుకు ఓ వ్యక్తి ఆ కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషిస్తూ ఆలయ బహిష్కరణ చేశారు దేవాలయ నిర్వాహకులు. ఘటన హైదరాబాద్ శివారులోని వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వనస్థలిపురం శ్రీ పద్మావతి సమేతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నక్క యాదగిరి గౌడ్ గత 14 ఏళ్లుగా పని చేస్తున్నాడు. అయితే, యాదగిరిగౌడ్ రెండు నెలల క్రితం ప్రేమలత అనే దళిత మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రేమలత మాదిగ కులస్థురాలు కావడంతో ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మయ్య, యాదగిరిగౌడ్‌ను ఉద్యోగం నుంచి తొలగించాడు. ఈ విషయం మాట్లాడేందుకు ప్రేమలత లక్ష్యయ్య ఇంటికి వెళ్లింది.

దీంతో కోపోద్రోక్తుడైన చైర్మన్ లక్షయ్య ప్రేమలతను కులం పేరుతో దూషిస్తూ.. ‘నీవు మాదిగ కులానికి చెందిన దానివి అని తెలిస్తే గుడిలోకి అడుగు పెట్టనిచ్చే వాళ్లం కాదు’ అని అసభ్యకరంగా దూషిస్తూ గేటు బయటికి గెంటేశాడు. అంతేగాకుండా ఆలయ కమిటీ సభ్యులు సత్యనారాయణ, మేనేజర్ శ్రీహరి, చిరంజీవిలు వాళ్ల అనుచరులతో కలిసి యాదగిరి, ప్రేమలతలు నివసిస్తున్న ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న సామాన్లను బయటకు విసిరి పారేశారు.

దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ముందు పోలీసులు సైతం వారినుంచి ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించినట్లుగా తెలిసింది. చివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న వనస్థలిపురం పోలీసులు విషయాన్ని బయటికి తెలియకుండా గోప్యంగా ఉంచి నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

Exit mobile version