హైదరాబాద్ వేదికగా జరిగిన గులాబీ పండుగ (టీఆర్ఎస్ పార్టీ ఫ్లీనరీ) సమావేశాలు ముగిశాయి… దాదాపు 8 గంటలపాటు వివిధ అంశాలపై చర్చ సాగింది.. మొత్తం 7 తీర్మానాలపై ప్లీనరీలో చర్చించింది ఆమోదం తెలిపారు.. అందులో కీలకమైనది పార్టీ బైలాస్‌లో పలు సవరణలకు ప్లీనరీ ఆమోదించడం.. పార్టీ ప్రెసిడెంట్ అందుబాటులో లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వహించేలా తీర్మానం చేశారు.. దీంతో.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌కు మరిన్ని పవర్స్ ఇచ్చినట్టు అయ్యింది.. ఇక, బీసీ గణన, ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరుతూ తీర్మానం, దళితబంధు, సంక్షేమంపై తీర్మానాలు చేసింది ఫ్లీనరీ..
ఇక, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించే అధికారం పార్టీ అధినేత కేసీఆర్‌కు అప్పగిస్తూ సమావేశం నిర్ణయం తీసుకొంది. మరో వైపు జిల్లా, నియోజకవర్గాల కార్యవర్గాన్ని నియమించే అధికారం కూడ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికే కట్టబెట్టింది.. మరోవైపు ఐటీ రంగంలో చోటు చేసుకున్న అభివృద్ధిపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్లీనరీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్‌తో రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. కేసీఆర్ చేపట్టిన సంస్కరణలు దేశానికే మార్గదర్శకం అని ప్రశంసించారు. టీఆర్‌ఎస్ చేసిన ప్రతి చట్టం.. తెలంగాణ ప్రజలకు చుట్టం అన్నారు. సమగ్ర భూసర్వే విప్లవాత్మక నిర్ణయం అన్నారు. కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అంటూ ప్రశంసలు కురిపించారు కేటీఆర్.
టీఆర్ఎస్ ప్లీనరీలో కీలక ఉపన్యాసం చేశారు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. ఉద్యమంలా దళిత బంధు అమలుచేస్తున్నామని, కేవలం దీనితోనే ఆగిపోదని భవిష్యత్తులో మరిన్నీ కార్యక్రమాలు చేపడుతామన్నారు. దళిత బంధు రాష్ట్ర ఆర్థిక పురోగతికి తోడ్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ఆర్థికపరంగా కూడా శక్తివంతంగా తయారైందన్నారు. 31 జిల్లాల్లో పార్టీ ఆఫీసులకు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, ప్రతీ నియోజకవర్గంలోనూ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఇక, వీఆర్‌వో వ్యవస్థకు బదులు ధరణి తీసుకొచ్చామని, రాష్ట్రంలో అద్భుతాలను ఆవిష్కరిస్తున్నామన్నారు. 30 కోట్ల టన్నుల వరి ఉత్పత్తి చేసి రికార్డు సాధించామని ప్రకటించిన గులాబీ అధినేత.. విద్యుత్ తలసరి వినియోగంలో నెం.1గా తెలంగాణ నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు. రెండు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రతినిధుల సభ (ప్లీనరీ) హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. ఈ ప్లీనరీ ఉత్సాహభరితంగా సాగిందని.. గులాబీ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని, నమ్మకాన్ని కలిగించిందని నేతలు చెబుతున్నారు.
