NTV Telugu Site icon

ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్‌ రెడ్డి..

తెలంగాణ ఆర్టీసీ బలోపేతంపై దృష్టిసారించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు.. ఈ మధ్యే టీఎస్‌ఆర్టీసీ ఎండీగా సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ వీసీ సజ్జనార్‌ను నియమించారు.. ఆయన క్షేత్రస్థాయిలో ఇప్పటికే ఆర్టీసీ పరిస్థితిపై అధ్యయనం మొదలు పెట్టారు.. ఇక, ఇవాళ ఆర్టీసీ చైర్మన్‌గా సీనియర్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డిని నియమించారు సీఎం కేసీఆర్.. ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి.. సుదీర్ఘ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని.. కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

సీనియప్‌ రాజకీయనేతగానే కాదు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కీలక నేతగా ఉన్నారు బాజిరెడ్డి.. 1999 నుండి 2004 వరకు ఆర్మూర్ నియోజకవర్గం నుంచి.. 2004 నుండి 2009 వరకు బాన్సువాడ నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన ఆయన.. దివంగతనేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత.. వైఎస్‌ జగన్‌ ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.. ఇక, 2014 ఎన్నికలకు ముందు వైసీపీకి గుడ్‌బై చెప్పిన బాజిరెడ్డి.. టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు.. నిజామాబాద్ నుండి పోటీచేసి డీఎస్‌పై విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో కూడ అదే స్థానం నుండి పోటీ చేసి మరోసారి గెలుపొందారు.. ఆయన సుదీర్ఘ అనుభవం.. ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల బాట పట్టిస్తుందన్న నమ్మకంతో.. కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. ఇప్పుడు.. వీసీ సజ్జనార్‌, బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి.. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొస్తారే చూడాలి మరి.