రోడ్లమీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలి. హెల్మెట్ పెట్టుకుని నడుపుతున్నా ఒక్కోసారి పోలీసులు ఆపి, తనిఖీలు చేస్తుంటారు. వాహన దారులంటే పోలీసులకు ఎంత అలుసో విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఓఘటన నిరూపించింది. తనిఖీలు చేసే సమయంలో వారికి ఎదురు చెబితే ఎంతకైనా తెగిస్తారనే విషయం అందరికీ తెలిసిందే.. బైక్ ఆపేవరకు ఉండకుండా నేరుగా అడ్డుగా రావడం, తాళాలు తీసుకెళ్లడం చేస్తుంటారు… ఇది ఏంటని ప్రశ్నిస్తే, రుబాబు చేస్తున్నారంటూ లాఠీకి పని చెబుతుంటారు.
నర్సీపట్నం మున్నిపాలిటీ బలిఘట్టంలో ఆదివారం ఓ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్న సమయంలో నర్సీపట్నం టౌన్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో మోటారు సైకిల్ పై ఒక వ్యక్తి తన భార్యతో పాటు తుని వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో పోలీసులు తనిఖీ చేసేందుకు బైక్ ను నిలపాలంటూ అడ్డుకున్నారు. పోలీసులు చెప్పినట్టు బండి పక్కకు తీసి, భార్యను కిందకు దిగమని చెప్పి, తను దిగేందుకు సిద్ధమయ్యాడు. ఈ లోపు ఒక కానిస్టేబుల్ బండి వద్దకు వచ్చే సరికి హెల్మెట్ పెట్టుకున్న ఆ వ్యక్తి వెనుక చూసుకోకుండా దిగడంతో అనుకోకుండా తన కాలు
కానిస్టేబుల్ కు తగిలింది.
దీంతో ఒక్కసారే ఆగ్రహించిన కానిస్టేబుల్ నన్నే తంతావా? అంటూ తీవ్రంగా ఆగ్రహించాడు. లాఠీతో కొట్టడం ప్రారంభించాడు. ఆ వ్యక్తి భార్య ఎంత బతిమిలాడినా, ఏడ్చినా వినకుండా తన పని కానిచ్చేశాడు. ఇదే సమయంలో చాటుగా ఒక యువకుడు వీడియో తీసి, అక్కణ్ణుంచి తప్పించుకున్నాడు.
ఎవరో వీడియో తీసారనే విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ వాడు ఎవరు? ఎక్కడున్నాడు? వాడిపై ఏదో కేసు పెట్టి లోపలకు తోసేస్తానంటూ కేకలు వేస్తూ బలిఘట్టం వీధుల్లో తిరిగాడు. అయితే స్థానికుల నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో తిరుగుముఖం పట్టాడు. వీడియో తీసిన యువకుడు దీనిని వైరల్ చేయడంతో ప్రస్తుతం నర్సీపట్నంలో ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై పోలీస్ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.