Site icon NTV Telugu

నువ్వు ఎలాగూ వెళ్లవు… మేం వెళ్తుంటే నొప్పేంటి?.. రేవంత్ ఫైర్‌

టి.పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు పోలీసులు.. దీంతో.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. కేసీఆర్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. పౌర స్వేచ్ఛను కేసీఆర్ సర్కార్‌ హత్య చేస్తోందంటూ మండిపడ్డ ఆయన.. ప్రతిపక్ష నేతల ఇళ్లల్లోకి ఖాకీలను ఉసిగొల్పుతున్నాడు అని.. సన్నిహితులు, మిత్రులు, బంధువుల ఇళ్లలో పరామర్శలకు, శుభకార్యాలకు కూడా వెళ్లనీయని నిర్భందకాండకు ఈ దృశ్యం ఉదాహరణగా పేర్కొన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణుకుపుడుతోందన్న రేవంత్‌.. మేం ఇంట్లో నుంచి కాలు కదిపితే ఆయన గజగజ వణికిపోతున్నాడు అని వ్యాఖ్యానించారు.

ప్రజా గ్రహం పెల్లుబికిన నాడు నీ ప్రగతి భవన్‌లు, ఫామ్‌హౌస్‌లు బద్ధలైపోతాయి.. జాగ్రత్త కేసీఆర్ అంటూ హెచ్చరించారు రేవంత్‌రెడ్డి.. ఇదేం సంస్కారం కేసీఆర్!?.. అంటూ మండిపడ్డారు.. అర్థరాత్రి నుండి పోలీసులతో ఇంటిని ముట్టడించడం… అనుమతి లేకుండా ఇంటిలోనికి ప్రవేశించడం.. పరామర్శలకు కూడా వెళ్లకుండా నిర్భందించడం… ఇదేనా కేసీఆర్ నీ పాలనా సంస్కారం.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. నీ కుంచిత ఆలోచన. తెలంగాణ భారత రాజ్యాంగ పరిధిలో రాష్ట్రమనుకుంటున్నావా? నీ ప్రైవేటు ఎస్టేట్ అనుకుంటున్నావా? చేతనైతే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు చస్తుంటే… పరామర్శించడం పాపమా..? అని నిలదీసిన ఆయన.. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లల్లో శుభకార్యాలు, పరామర్శలకు వెళ్లి గంటల తరబడి గడుపుతున్న కేసీఆర్… ధాన్యం, మిర్చీ రైతుల చావుకేకలు నీ చెవికి చేరడం లేదా!? అంటూ ప్రశ్నించారు.. పెద్దోళ్ల ఇళ్లల్లో కార్యాలకు వెళతావు కానీ… పేదరైతు కుటుంబాన్ని పరామర్శించే తీరకలేదా!? నువ్వు ఎలాగూ వెళ్లవు… మేం పరామర్శిస్తుంటే నీకొచ్చిన నొప్పేంటి? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేవారు రేవంత్‌రెడ్డి.

Exit mobile version