పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని అటవీ గ్రామాలలో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు.. కొయ్యూరు అటవీ ప్రాంతం నుండి మంథని మండలంలోని అడవి సోమనపల్లి గ్రామ పరిధిలో గల అటవీ ప్రాంతానికి పులి వచ్చినట్లు వారు తెలిపారు.
అడవి సోమనపల్లి, వెంకటపూర్, అరేంద, ఖానాపూర్, కాన్సాయి పేట గ్రామస్తులు, ఎడ్ల, గొర్ల, బర్ల కాపరులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.
పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ గ్రామ శివారు వైపు వెళ్లినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దీనితో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్ అడవిలో కూడా పులి సంచరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పీవీ నగర్ గ్రామ సమీపంలో పులి రోడ్డు దాటుతుండగా చూసిన ప్రయాణికుడు.. స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వగా అధికారులు అప్రమత్తమయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ సీసీఎఫ్‌డీఎప్‌వో ఉన్నత స్థాయి అధికారులు.. నైనా గుట్టల్లో పులి తలదాచుకున్నట్లు గుర్తించారు. అయితే అడవిలోకి పరిసర ప్రాంతాల ప్రజలు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.