ఏపీలో ఇటీవల నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 నగరపంచాయతీ, గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కొన్ని స్థానాల్లో వైసీపీ దూసుకుపోగా, మరొకొన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు సత్తాచాటారు. అయితే తాజాగా కొండపల్లి మున్సిపాలిటీకి చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొండపల్లి మున్సిపాలటీలో 29 స్థానాలు ఉండగా అందులో 14 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలువగా, మరో 14 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థి లక్ష్మీ కూడా గెలుపొందారు.
అయితే స్వతంత్ర అభ్యర్థి లక్ష్మీ టీడీపీకి మద్దతిస్తూ టీడీపీలో చేరారు. అంతేకాకుండా ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకునేందుకు వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ, టీడీపీ ఎంపీ కేశినేని నాని సిద్ధమయ్యారు. తాజాగా గెలుపొందిన అభ్యర్థులు ఎన్నిక ప్రక్రియ కోసం కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే అధికారులు అభ్యర్థులను కౌన్సిల్ హాల్‌లోకి అనుమతించలేదు. దీంతో కార్యాలయం వద్ద ఉన్న చెట్టుకిందే గెలుపొందిన అభ్యర్థులు వేచిఉన్నారు. ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.