నటుడిగా, దర్శకుడిగా రవిబాబుకు తెలుగులో మంచి గుర్తింపే ఉంది. యాడ్ ఫిల్మ్ మేకర్ కూడా అయిన రవిబాబు డైరెక్టర్ గా డిఫరెంట్ జానర్ మూవీస్ చేశారు. కామెడీ, లవ్, హారర్, థ్రిల్లర్ మూవీస్ తీసి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. అయితే కొంతకాలంగా ఆయన తీసిన సినిమాలేవీ విజయం సాధించడం లేదు. బహుశా ఆ ఫ్రస్ట్రేషన్ తో కాబోలు ఇప్పుడు అడల్ట్ కామెడీ మూవీని తీశారు. ‘క్రష్’ పేరుతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రస్తుతం జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే… రవిబాబు మీద ప్రేక్షకులకు ఇప్పటి వరకూ ఉన్న అంచనాలను ఈ సినిమా ‘క్రష్’ చేసి పారేసింది.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళడానికి రవి (అభయ్ సింహా), వంశీ (కృష్ణ బూరుగుల), తేజు (చరణ్ సాయి) అనే ముగ్గురు స్నేహితులు రెడీ అవుతుంటారు. ఇంతలో అమెరికా నుండి వచ్చిన వాళ్ళ స్నేహితుడు ఓ విషయం చెబుతాడు. చదువు మీదనే దృష్టి పెట్టే తెలుగు కుర్రాళ్ళంటే అమెరికన్ గర్ల్స్ కు చిన్నచూపు అని, పైగా అబ్బాయి వర్జిన్ అని తెలిస్తే అసలు విలువ ఇవ్వరని, తాను అలానే అవమానాల పాలయ్యానని వాపోతాడు. అతను చెప్పిందే నిజం అని నమ్మిన ఈ ముగ్గురు కుర్రాళ్ళు అమెరికా వెళ్ళేలోపు తమలోని మగతనాన్ని నిరూపించుకునే పనిలో పడతారు. ఆ సందర్భంలో వారు ఎలాంటి అగచాట్లకు లోనయ్యారు? చివరకు ఎలాంటి అనుభవాన్ని పొందారన్నదే ఈ సినిమా కథ.
అడల్ట్ కంటెంట్ తో రంగంలోకి దిగిన రవిబాబు… దాన్ని కాస్తంత డీసెంట్ గా డీల్ చేయాల్సింది పోయి, చౌకబారు బి గ్రేడ్ మూవీని తలపించేలా తీశారు. రవిబాబు లాంటి పేరున్న దర్శకుడి నుండి ఇలాంటి సినిమా వస్తుందని ఊహించని వారికి ఇది ఎంత మాత్రం మింగుడు పడదు. కెరీర్ ప్రారంభంలోనే ‘అల్లరి’, ‘అమ్మాయిలు అబ్బాయిలు’, ‘పార్టీ’ వంటి సినిమాలో కొంత అడల్ట్ కంటెంట్ కు చోటిచ్చినా, అప్పుడు మరీ ఇంతలా రవిబాబు రెచ్చిపోలేదు. ఆ తర్వాత ఆయన తీసిన ‘అనసూయ, నచ్చావులే, అమరావతి’ వంటి సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక ‘మనసారా’ కూడా మ్యూజికల్ హిట్ అయ్యింది. దాంతో రవిబాబు సినిమాలో చక్కని మ్యూజిక్ తో పాటు ఆకట్టుకునే టేకింగ్ ఉంటుందని ప్రేక్షకులు నమ్మడం మొదలెట్టారు. ‘అవును’ వరకూ ఫర్వాలేదనిపించుకున్న రవిబాబు, ఆ మధ్య తీసిన ‘అదుగో, ఆవిరి’తో తన అభిమానులను సైతం తీవ్ర నిరాశకు గురిచేశాడు. ఇదీ ఆ కోవకు చెందిన సినిమానే.
ఇందులో ముగ్గురు కుర్రాళ్ళు, వాళ్ళకు జోడీగా నటించిన ఇద్దరు అమ్మాయిలు (అంకిత మనోజ్, పర్రి పాండే) దాదాపు కొత్త వాళ్ళు. అభయ్, కృష్ణ నటన ఫర్వాలేదు. చరణ్ సాయికి కమెడియన్ అయ్యే లక్షణాలు ఉన్నాయి. కానీ ఈ ముగ్గురు కుర్రాళ్ళు, అమ్మాయిల నుండి మనం ఎలాంటి హావభావాలు ఆశించలేం. ఎందుకంటే… ఈ కథలో వాళ్ళకు శృంగర రసం పోషించడానికే దర్శకుడు ఛాన్స్ ఇచ్చాడు. ఇక మిగిలిన పాత్రలను కాస్తంత గుర్తింపు ఉన్న వాళ్ళే చేశారు. రావిపల్లి రాంబాబు, ప్రియదర్శిని, చైతన్య, అరుణ శ్రీ, నాగశయన్, మాధవి, శ్రావణ సంధ్య వంటి వాళ్ళు గతంలో కొన్ని సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించిన వాళ్ళే. కాబట్టి వాళ్ళ నటనలో కాస్తంత మెచ్యూరిటీ కనిపిస్తుంది. ‘అర్జున్ రెడ్డి’లో కాస్తంత ఓవర్ గా చేసిన సాయిసుధ, ఇందులో కుర్రకారును తన హావభావాలతో మరింతగా ఇంప్రస్ చేసే ప్రయత్నం చేసింది.
ఈ చిత్రానికి కథ రాసుకుంది రవిబాబే, మాటల్ని నివాస్, స్క్రీన్ ప్లేను సత్యానంద్ అందించారు. కానీ వారి సీనియారిటీ ఎంచుకున్న చెత్త కథ కారణంగా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. సినిమా నిండా లేకి సన్నివేశాలను పెట్టేసి, చివరిలో మాత్రం ‘మహిళలను గౌరవించాలి, వారి అభిప్రాయాలకు భిన్నంగా ఎవరూ ప్రవర్తించ కూడద’నే నీతి పాఠాలు చెప్పారు. అదృష్టం బాగుండి ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కాలేదు. ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా ప్రారంభంలో మాత్రం సెన్సార్ సర్టిఫికెట్ ను ప్రదర్శించారు. ఒకవేళ సెన్సార్ అయితేనే ఇంత వల్గర్ సీన్స్ ఉంటే… దానికి ముందు ఎలాంటి సన్నివేశాలు ఉన్నాయో ఊహించుకోవచ్చు. ఓటీటీ మూవీస్ కు సెన్సార్ అవసరం లేదు కాబట్టి… ఇప్పుడు ఈ సినిమాలోని చీప్ సీన్స్ గురించి చర్చించుకోవడం కూడా అనవసరమే.
నిజానికి డైరెక్షన్, టేకింగ్, మ్యూజిక్, పబ్లిసిటీ విషయంలో రవిబాబు తనదైన ప్రత్యేకతను చాటుకుంటారు. కానీ ఈ సినిమాలో అవేవి కనిపించవు. ‘ఎవరే నువ్వు… వెన్నెల గువ్వా… రంగుల పువ్వా’ అనే మెలోడీ గీతం, ‘నచ్చానంటావా… నచ్చానంటావా’ అనే పాట బాణీ, సాహిత్య పరంగా బాగున్నాయి. కానీ వాటి పిక్చరైజేషన్ ఇప్రసివ్ గా లేదు. ఓవర్ ఆల్ గా చెప్పుకోవాలంటే… ఈ అడల్డ్ కమెడీ సినిమాను పెద్దవాళ్ళు సైతం మెచ్చలేరు. కుర్రకారుకు మసాలా సీన్స్ ఉన్నాయి కాబట్టి కొంత మేర నచ్చే ఛాన్స్ లేకపోలేదు.
రేటింగ్ : 2/5
ప్లస్ పాయింట్స్
నేపథ్య సంగీతం
ఒకటి రెండు పాటల సాహిత్యం
మైనెస్ పాయింట్స్
అడల్ట్ కంటెంట్
చీప్ టేకింగ్
బోర్ కొట్టించే సీన్స్
ట్యాగ్ లైన్: ‘క్రష్’ కావడం ఖాయం!