తెలంగాణలో యూట్యూబ్ ఛానెళ్ళు లెక్కకు మిక్కిలిగా పెరిగిపోయాయి. వాటిపై నియంత్రణ కూడా వుండడం లేదు. దీంతో యూట్యూబ్ వార్తా చానెళ్లకు ముకుతాడు వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగిస్తోంది. యూట్యూబ్ చానెళ్లు చేస్తున్న అభ్యంతరకర ప్రసారాలపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అసత్య, విద్వేషపూరిత వార్తలు ప్రసారాలు చేయడం, మతాలు, కులాల మనోభావాలను దెబ్బతీయడం వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం వుంది.
రాజకీయంగా కొందరిని టార్గెట్ చేసుకుని కామెంట్లు, పోల్స్ పెట్టి వ్యక్తిగత, కుటుంబ ప్రతిష్టను భంగపరిస్తే చూస్తూ ఊరుకోకూడదని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఇటీవల సీఎం కేసీఆర్ మనవడిపై క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానెల్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీఆర్‌ఎస్ పార్టీ, కేటీఆర్ తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) శాఖ కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
సోషల్ మీడియా పోస్టింగులు, న్యూస్ చానెళ్ల కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎతిక్స్ కోడ్) రూల్స్- 2021ను ప్రకటించింది. దీనిప్రకారం యూట్యూబ్, ఇతర ఆన్‌లైన్ న్యూస్ చానెళ్లలో అసత్య, విద్వేషపూరిత వార్తలు ప్రసారం చేస్తే సంబంధిత చానెళ్లే బాధ్యత వహించాలి. ప్రసారాలపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించడం, వాటిని గరిష్ఠంగా 15 రోజుల్లోపు పరిష్కరించడం చానెళ్ల బాధ్యత. కానీ ఇలాంటివి ఏవీ అమలు కావడం లేదు.
రాష్ట్రంలో దాదాపు 300 వరకు యూట్యూబ్ వార్తా చానెళ్లు వున్నాయని అంచనా. నిబంధనలు పాటించాలని, లేదంటే చర్యలు తప్పవంటోంది ఐటీశాఖ. త్వరలో ఆయా యూట్యూబ్ వార్తా ఛానెళ్ళ యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రజల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రతి చానెల్ తప్పనిసరిగా కార్యాలయ చిరునామా, ప్రతినిధి పేరు, ఫోన్ నంబర్లను ప్రదర్శించాలి. జర్నలిజంపై ఏమాత్రం అవగాహన లేని వారు సైతం యూట్యూబ్ చానెళ్లను నిర్వహిస్తున్నట్టు పరిశీలనలో తేలింది. అయినా నిబంధనలను పాటించకుండా వ్యవహరించే ఛానెళ్ళకు యూట్యూబ్ ద్వారా నెలనెలా అందే చెల్లింపులను ఆపేలాచర్యలకు ఉపక్రమిస్తామంటున్నారు అధికారులు.