తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలను ఏకతాటిపైకి నడిపేందుకు కీలక సమావేశం నిర్వహించిన రాహుల్ గాంధీ.. విబేధాలను వదిలి అంతా కలిసికట్టుగా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.. ఈ సమావేశంలో అందరి నేతల అభిప్రాయం తీసుకున్న రాహుల్.. భేటీకి సంబంధించిన విషయాలను ముగ్గురు మాత్రమే మీడియాకు వెల్లడించాలని సూచించారు. దీంతో.. సమావేశం ముగిసిన తర్వాత.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడితో మాట్లాడారు.. మాలో ఉన్న విబేధాలపై రాహుల్ గాంధీతో చర్చ జరిగింది.. జరిగింది జరిగి పోయింది.. ఇక అందరం కలిసి పని చేస్తాం.. టీఆర్‌ఎస్, ఎంఐఎంలతో సంబంధం ఉండదు.. ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు, రాహుల్ గాంధీ అభ్యర్థులను ప్రకటిస్తారని వివరించారు.
Read Also: Breaking: రాజీనామా లేఖను విత్‌డ్రా చేసుకున్న జగ్గారెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలమంతా రాహుల్ గాంధీని కలిశాం, రాష్ట్రంలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులు సుదీర్ఘంగా చర్చించాం.. ప్రజా సమస్యలపై పోరాడాలని రాహుల్ గాంధీ సూచించారని వెల్లడించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. మతం ముసుగులో రాజకీయంగా ఎదగాలని చూస్తున్న బీజేపీని తెలంగాణ పొలిమేరలో రాకుండా చూడాలని నిర్ణయం తీసుకున్నామన్న ఆయన.. టీఆర్ఎస్, బీజేపీ.. తెలంగాణ సమాజాన్ని విభిజిస్తున్నాయని మండిపడ్డారు. ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ప్రతీ గ్రామానికి వెళ్లాలని రాహుల్ గాంధీ సూచించారన్న ఆయన.. నాయకుల మధ్యలో ఉన్న చిన్న చిన్న అభిప్రాయాలను పక్కన పెట్టాలన్నారు.. అన్ని సమస్యలను పరిష్కరించుకొని ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. ప్రజా సమస్యలపై పోరాడి వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామని.. సోనియా గాంధీ ఆధ్వర్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. గ్రామ గ్రామానికి వెళ్లి పార్టీని పటిష్టం చేయడమే కాకుండా అధికారంలోకి వస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రజల్లో పోరాడుతామని ప్రకటించారు రేవంత్ రెడ్డి.
ఇక, రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలపై రాహుల్ గాంధీతో చర్చించాం.. మాలో ఉన్న కొన్ని విభేదాలపై రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారని.. ఇక నుంచి అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని రాహుల్ గాంధీ సూచించారని తెలిపారు పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి.. టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం దోస్తీ గురించి రాహుల్ గాంధీతో చర్చించామన్న ఆయన.. రాబోయే కాలంలో ఐక్యమత్యంగా.. సంఘటితంగా టీఆర్ఎస్ పార్టీపై పోరాడుతామని ప్రకటించారు ఉత్తమ్. మరోవైపు.. కలిసికట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. ఐకమత్యంగా ప్రజల్లోకి వెళ్లి పార్టీని అధికారంలోకి లక్ష్యంగా పని చేస్తామన్నారు.. రాష్ట్రానికి రాహుల్ గాంధీ రావాలని ఆహ్వానించాం.. వీలైనంత వరకు ఎక్కువసార్లు వస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. మరోవైపు.. ఈ సమావేశం తర్వాత రాజీనామా లేఖను వెనక్కి తీసుకుంటున్నట్టు జగ్గారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
