సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశం జరిగాఇంది.. మధ్యాహ్నం రెండున్నరకు ప్రారంభమైన కేబినెట్ సమావేశం దాదాపు ఆరుగంటల పాటు సాగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నది. మొదటగా రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై కేబినెట్ లో చర్చ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై వైద్యాధికారులతో కేబినెట్ ఆరా తీసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులు, తీసుకుంటున్న చర్యలపై వైద్యాధికారులు కేబినెట్ కు సమాచారం అందించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలల్లో కరోనా పరిస్థితి, నియంత్రణకు సంబంధించిన సమాచారాన్ని కేసీఆర్ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. విద్యాసంస్థలు పునఃప్రారంభమైన అనంతర పరిస్థితులను కేబినెట్ కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖాధికారులు వివరించారు.
కేబినెట్ నిర్ణయాలు:
- స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నేటి నుండి ప్రారంభమైంది.. ప్రతి గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లోని పంచాయతి మున్సిపల్ అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీ, జెడ్పీ చైర్ పర్సన్, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు తదితర ప్రజాప్రతినిధులు క్రీయాశీలకంగా వ్యవహరించాలని, మంత్రులందరూ ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయం సాధించాలని, ప్రతిరోజు 3 లక్షల వరకు టీకాలు వేసే విధంగా పూర్తి సన్నద్దతతో వ్యవహరించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను కేబినెట్ నిర్దేశించింది.
- కొత్త మెడికల్ కాలేజీలు వచ్చే సంవత్సరం నుండి ప్రారంభించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్ అండ్ బి, వైద్యారోగ్య శాఖను కేబినెట్ ఆదేశించింది.
- హైదరాబాద్ లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ ఏర్పాటుపై కేబినెట్ సమీక్షించింది.. దవాఖానాల నిర్మాణ ఏర్పాట్లపై సత్వరమే చర్యలు చేపట్టాలని, అత్యంత వేగంగా ఆసుపత్రుల నిర్మాణం జరగాలని రోడ్లు భవనాల శాఖను కేబినెట్ ఆదేశించింది.
- గతంలో 130 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్ద్యం మాత్రమే వుండేదని, దాన్ని ఇప్పటికే 280 మెట్రిక్ టన్నులకు పెంచుకున్నామని, దీనిని మరింత పెంచి 550 మెట్రిక్ టన్నులకు చేరుకునేలా చర్యలు చేపట్టాలని వైద్యశాఖాధికారులను కేబినెట్ ఆదేశించింది.
- రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆరోగ్య మౌలిక వసతుల పురోభివృధ్ది కొరకు సమగ్రమైన ప్రణాళికలను సిద్దం చేసుకుని తదుపరి కేబినెట్ ముందుకు తీసుకురావాలని మంత్రి మండలి వైద్య శాఖాధికారులను ఆదేశించారు.
- వర్షాపాత వివరాలు, వానాకాలంలో రాష్ట్రంలో మొత్తం సాగయిన భూమి వివరాలు, పంటల దిగుబడి అంచనాలు తదితర వ్యవసాయ అంశాల పై కేబినెట్ చర్చించింది. వానాకాలంలో పంటల కొనుగోలుపై అందుకు మార్కెటింగ్ శాఖ సన్నద్ధతపై కేబినెట్ చర్చించింది.
- పోడు భూముల సమస్యలపై పూర్తి అవగాహన, పరిష్కారాల అన్వేషణ, సూచనలకై కేబినెట్ సబ్ కమిటీ నియామకం జరిగింది. ఈ సబ్ కమిటిలో మంత్రి సత్యవతి రాథోడ్ చైర్మన్ గానూ., మంత్రులు జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, అజయ్ కుమార్ లు సభ్యులుగానూ వ్యవహరిస్తారు.
- కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఇతర పోలీస్ స్టేషన్లలోని సమస్యలు అవసరాలను సమీక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీ నియమిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది.
- హోంశాఖ మంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, ఇంద్ర కరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లు సభ్యులుగా సబ్ కమిటీ పనిచేస్తుంది.
- రాష్ట్రంలో నూతనంగా జిల్లాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు సబ్ కమిటీ పోలీసు శాఖను పూర్తి స్థాయిలో సమీక్షిస్తుంది
- ధరణి పోర్టల్ లో తలెత్తుతున్న సమస్యల పరిష్కార మార్గాలకోసం… మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి లతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ తీర్మానం.
- ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు, వచ్చే యేడాది నుంచి… మద్యం దుకాణాల్లో.. గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని కేబినెట్ నిర్ణయం.
- రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాడయిన రోడ్ల మరమ్మతుకు ఈ సంవత్సరం ఇప్పటికే కేటాయించిన రూ. 300 కోట్లకు అదనంగా మరో రూ.100 కోట్లు కేబినెట్ కేటాయించింది. ఈ మేరకు పంచాయితీ రాజ్ శాఖకు కేబినెట్ ఆదేశాలు జారీచేసింది.
- రాజాబహద్దూర్ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి కోరిక మేరకు, నారాయణ గూడలో 1261 గజాల స్థలాన్ని నామ మాత్రపు ధరకు, బాలికల వసతి గృహ నిర్మాణం కోసం కేబినెట్ కేటాయించింది.
- సంగారెడ్డి, ఆంధోల్, జహీరాబాద్, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గాల్లో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
- సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి సింగూరు జలాశయం కుడి వైపు నుంచి 12 టిఎంసీల నీటిని ఎత్తిపోసి జహీరాబాద్, ఆంధోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో 2.19 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని ప్రతిపాదించడం జరిగింది.ఈ పథకం ద్వారా ఈ నియోజకవర్గాల్లోని 11 మండలాల్లో 231 గ్రామాలకు సాగునీరు అందుతుంది. ప్రాజెక్టుకు రూ.2,653 కోట్ల పరిపాలన అనుమతికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
- బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి సింగూరు జలాశయం ఎడమ వైపు నుంచి 8 టిఎంసీల నీటిని ఎత్తిపోసి నారాయణ్ ఖేడ్, ఆంధోల్ నియోజకవర్గాల్లో 1.65 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని ప్రతిపాదించడం జరిగింది. ఈ పథకం ద్వారా ఈ నియోజకవర్గాల్లోని 8 మండలాల్లో 166 గ్రామాలకు సాగునీరు అందుతుంది. ప్రాజెక్టుకు రూ.1,774 కోట్ల పరిపాలన అనుమతికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
- ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు నాబార్డు ద్వారా రుణాలు పొందడానికి కూడా మంత్రివర్గం సాగునీటి శాఖకు ఆమోదం ఇచ్చింది.
- కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజి 15,16 లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్మాణమౌతున్న నృసింహసాగర్ (బస్వాపూర్ జలాశయం) నాబార్డు ద్వారా రూ.2051.14 కోట్ల రుణం పొందడానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.