NTV Telugu Site icon

తెలకపల్లి రవి : రఘురామ కేసు పూర్తిగా సుప్రీం చేతికే !

ఎంపి రఘురామకృష్ణంరాజు అరెస్టు వివాదం ఇప్పుడు పూర్తిగా సుప్రీం కోర్టు చేతుల్లోకి వెళ్లిపోవడం వూహించిన పరిణామమే. ఆయనను ఎపి సిఐడి పోలీసులు దర్యాప్తు సందర్భంలో కొట్టారో లేదో తేల్చడానికి సికిందరాబాదులోని ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని అత్యున్నత న్యాయస్తానం ఆదేశించింది. తాను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఆయనను అక్కడే కొనసాగించాలని కూడా స్పష్టం చేసింది. ఈ వైద్య పరీక్షల ఖర్చు ఎంపినే భరించాలని కూడా చెప్పడం కొసమెరుపు. ఏమైనా ఇప్పుడు అరెస్టును మించి ఆయనను కొట్టారా లేదా అన్నది కీలక వివాదంగా మారింది. అరెస్టు తర్వాత ఆయన ఒంటిమీద కొత్తగా గాయాలు కాలేదని గుంటూరు ఫ్రభుత్వాసుపత్రి నిపుణులు బృందం ఇచ్చిన నివేదికను ఎపి హైకోర్టు ప్రశ్నించలేదు గాని సుప్రీం కోర్టు మాత్రం మరోసారి పరీక్షలు చేయించాలని మొదటే నిర్ణయించింది.

ఇందుకోసం ఉభయ పక్షాలు సూచించిన చోట్లు గాక ఆర్మీ ఆస్పత్రిని ఎంపిక చేసింది. వైద్యపరీక్షలకు ఒక బృందాన్ని నియమించాలని ఆస్పత్రిని ఆదేశించింది. రాజకీయాలోకి ఆర్మీ ఆస్పత్రిని లాగడమెందుకని సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అన్నప్పటికీ తను నియమించే జ్యూడిషియల్‌ అధికారి సమక్షంలోనే పరీక్ష జరుగుతుంది గనక బాధ్యత తమదేనని చెప్పింది, పరీక్షలు వీడియో తీయించాలని నివేదికను సీల్డ్ కవర్‌లో తెలంగాణహైకోర్టు ద్వారా తమకు చేర్చాలని సుప్రీం ఆదేశం. ఆ ఆరు ఆదేశాలు 1.తరలింపు, 2.నిపుణు బృందం నియామకం 3.జ్యుడిషియల్‌ అధికారి 4. విడియో తీయించడం 5.తదుపరి ఆదేశాల వరకూ అక్కడే వుంచడం 6.ఖర్చు ఎంపినే భరించడం ఆ మేరకె తెలంగాణ హైకోర్టును ఆదేశించడం వారు ఒక అధికారిని నియమించడం రఘురామరాజును గుంటూరు నుంచి తరలించడం అన్నీ జరిగిపోయాయి. రాత్రికి ఆయన చేరితే బహుశా రేపు ఈ పరీక్షలు జరగొచ్చు.

ఈ రోజు వాదోపవదాలలో ఎంపి రఘురామ తరపున ముకుల్‌ రోహ్తగి రాజకీయ కక్షసాధింపులతోనే అరెస్టు జరిగిందని, కొట్టారనీ, దానిపై గుంటూరు ఆస్పత్రి నివేదికపైన తమకు నమ్మకం లేదని చెప్పారు. తర్వాత ఏం చేయానేదానిపై మంగళగిరిలోని ఎయిమ్స్‌తో సహా వివిధ అవకాశాలు పరిశీలించిన మీదట ఆర్మీ ఆస్పత్రిని ఎంచుకున్నారు. కొన్ని ఆస్పత్రులకు ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్‌ దవే అభ్యంతరం చెప్పారు. ఆర్మీ ఆస్పత్రిలో కూడా వైద్య పరీక్ష కోసం తప్ప చికిత్స కోసం అవసరం లేదన్నారు. ఇక ఎంపిక బెయిల్‌ మంజూరు చేయాలని పెట్టుకున్న పిటిషన్‌పై విచారణ ఇంకా మొదలు కాలేదు. అసలు అరెస్టు గురించి ఆవిధమైన సాధారణ వాదనలు జరగనేలేదు. ధర్మాసనం కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. హైకోర్టులోనూ అంతే జరిగింది.

తర్వాత గుంటూరులోని సిఐడి కోర్టులో ఆరవమేజిస్ట్రీట్‌ ముందుకు విచారణ మారింది. ఇప్పుడు ఇక సుప్రీం ఆదేశాలే అందరికీ శిరోధార్యం కానున్నాయి. సాధారణంగా బెయిల్‌ పిటిషన్లు తమదాకా వద్దని సుప్రీం చెప్పడం కద్దు. ఇప్పుడు వైద్య పరీక్ష నివేదిక తర్వాత ఏంచెబుతుందో చూడాలి. శుక్రవారం బెయిల్‌పై విచారణ చేస్తామని అప్పటిదాకా ఆస్పత్రిలో జ్యుడిషియల్‌ కస్టడీలో వున్నట్టు పరిగణించాలని చెప్పింది. ఆర్మీ ఆస్పత్రి నివేదిక, శుక్రవారం సుప్రీం ఆదేశాలు ఈ కేసు భవితవ్యం తేలుస్తాయి. బెయిల్‌ను పరిశీలించడం అంటే అరెస్టును ధృవీకరించడమే. కాని చివరకు ఈ కేసు ప్రభుత్వానికి ఇరకాటంగా మారదనే గ్యారంటీ కూడా లేదు.

మరో వైపున రెండు న్యూస్‌ ఛానళ్లు కూడా సుప్రీంను ఆశ్రయించడం ఇందులో భాగమే. ఎంపి పై కుట్ర ఆరోపణలు ఒకటైతే వాటిని మీడియా కోణంలో ఎలా నిరూపిస్తారనేది ప్రభుత్వం ముందున్న ప్రశ్న. భావ ప్రకటనా స్వేచ్చ వాటికి లేదా అందరూ ప్రశ్నిస్తున్న స్థితి. రాజకీయంగా ఈ రోజు ఉదయమే వైసీపీ పార్లమెంటరీ పార్టీ ఎంపిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తగా తెలుగుదేశం, బిజెపి నాయకులు మాత్రం గట్టిగా బలపరుస్తుండడం ఆసక్తికరమైన అంశం. టిడిపితో ఎంపిని ముడిపెట్టి విమర్శిస్తున్న వైసీపీ బిజెపి వత్తాసును మాత్రం ప్రస్తావించకపోవడం విశేషం.