NTV Telugu Site icon

తెలకపల్లి రవి : అంబులెన్స్ వివాదం తెచ్చిన ప్రశ్న! ఉమ్మడి రాజధాని ఇంకా ఉన్నట్టా, లేనట్టా..?

ఎపి నుంచి వచ్చే ఆంబులెన్సును తెలంగాణ పోలీసులు సరిహద్దు చెక్‌పోస్టులో ఆపడం తీవ్ర ఆందోళన ఆవేదనకు దారితీసింది. కరోనాచికిత్స అవసరాలను బట్టి చూసినా హైదరాబాద్‌కు మరో మూడేళ్లు ఎపి తెంగాణ ఉమ్మడి రాజధాని ప్రతిపత్తి రీత్యా చూసినా ఇది చాలా అనూహ్యమైన పరిణామం. ఈ ఘటను కలకలం రేపుతున్నా ప్రభుత్వం నుంచి అధికారికంగా స్పందన లేకపోయింది. తెలంగాణ హైకోర్టు తనకు తానుగా దీనిపై ఆగ్రహం వెలిబుచ్చి ఆపవద్దని ఆదేశాలు జారీ చేసింది. అయినా తెలంగాణ వైఖరి మారకపోవడం, ప్రభుత్వం ఒక ఏకపక్ష సర్క్యులర్‌ ఇవ్వడంతో ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్‌) వేయాల్సి వచ్చింది. ఆ సమయంలో హైకోర్టు మరింత తీవ్రంగా హెచ్చరించింది. దేశంలో ఎక్కడైనా చికిత్స పొందే హక్కు అవకాశం వున్నప్పుడు ఇలా అడ్డుకోవడం రాజ్యాంగం 21వ అధికరణానికి వ్యతిరేకమని స్పష్టం చేసింది. అప్పటికిగాని ఏపి ప్రభుత్వ జోక్యం లేకపోయింది. చాలా ఆలస్యంగా స్పందించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపై విచారం వెలిబుచ్చుతూ మానవతా దృక్పథంతో ఆంబులెన్సును అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. చెన్నై బెంగుళూరు వంటి చోట్ల లేని అభ్యంతరం హైదరాబాదులో ఎందుకని ప్రశ్నించారు.

ఎపిలో సదుపాయాలు లేక వారు హైదరాబాదు వస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే మీ పాలన వల్లనే ఆరోగ్యవ్యవస్థ అరకొరగా వుండిపోయిందని సజ్జల వాదించారు. సచివాలయ తాళాలు అప్పగించిన తర్వాత ఇంకా ఉమ్మడి రాజధాని ఏమిటని టిఆర్‌ఎస్ పత్రిక రాస్తే చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి వచ్చేయడం వల్లనే హక్కు పోయిందని కూడా అధికార ప్రతినిధి అన్నారు. కేంద్రాన్ని పాలించే బిజెపి రాష్ట్ర అద్యక్షుడు సోము వీర్రాజు హైదరాబాదు పై ఎపికి ఇప్పటికీ సంపూర్ణ హక్కులున్నాయని వ్యాఖ్యానించారు. రాజ్యాంగపరంగా ఇందులో ఏది వాస్తవమో తేల్చుకోవలసిన అంశమే అవుతుంది.

ఆంధ్రప్రదేశ్‌ పునర్యవవస్థీకరణ చట్టం 2014 రెండవ భాగంలో అయిదో అంశం హైదరాబాదు పదేళ్ల పాటు ఎపి తెంగాణ ఉమ్మడి రాజధానిగా వుంటుందని పేర్కొంటున్నది. ఆ సమయం అయిపోయిన తర్వాత తెలంగాణ రాజధాని అవుతుందని కూడా స్పష్టం చేసింది. ఈ లోగా పరిశేషాంధ్ర ప్రదేశ్‌ స్వంత రాజధాని నిర్మించుకోవడానికి నిర్ణయించుకోవడానికి సహాయపడేందుకై ఒక కమిటీని వేయాలని కూడా పేర్కొంది. శివరామకృష్ణ కమిటీ ఆ విధంగానే ఏర్పాటైంది. తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రతిపాదించడం, ప్రధాని మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ తదితరులు సమక్షంలో శంకుస్థాపన చేయడం తెలిసిన విషయాలే. ఇప్పటికీ అది పూర్తి కాకపోగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ మూడు రాజధానుల పేరిట తీసుకున్న నిర్ణయంపై ప్రతిష్టంభన సాగుతూనే వుంది, అయితే హైదరాబాదులో ఎపికి కేటాయించిన సచివాలయ భవనాలను తమకు ఇవ్వాలని కెసిఆర్‌ చేసిన అభ్యర్థనను చంద్రబాబు అంగీకరించలేదు. జగన్‌ ప్రభుత్వం వచ్చిన కొద్ది కాలానికే ఆ కోర్కెకు ఆమోదం తెలిపి సచివాయ భవనాలను అప్పగించింది. కెసిఆర్‌ ప్రబుత్వం పాతభవనాన్ని పూర్తిగా కూల్చి కొత్త నిర్మాణం తలపెట్టింది. ఇవన్నీ జరుగుతుండగా ఏ సమయంలోనూ హైదరాబాద్‌ పదేళ్ల ఉమ్మడి రాజధాని అన్న నిబంధన ఏమైందనే స్పష్టత కోసం ఎవరూ ప్రయత్నించలేదు. ఇప్పుడు కోవిడ్‌ నేపథ్యంలో ఆంబులెన్సును నిలిపేయడంతో మళ్లీ ఈ ప్రశ్న ముందకొచ్చింది. పదేళ్ల కాలం అంటే 2024 వరకూ మరో మూడేళ్ల సమయం వుంది. సాధారణ ప్రజానీకం ఉమ్మడి రాజధాని నిబంధన ఇంకా కొనసాగుతుందనే భావిస్తూ వస్తున్నారు.ఇలాటి సమయంలో హఠాత్తుగా ఆంబులెన్సును నిలిపేయడం ఆ అంశాన్ని మళ్లీ ముందుకు తెచ్చింది.

చంద్రబాబు ఉమ్మడి రాజధానిని తాకట్టు పెట్టారని వదులుకున్నారని ఆరోపిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఆ హక్కు అయిపోయిందని భావిస్తున్నదా? సచివాయం తాళాలు అప్పగించాక ఇంకెక్కడి ఉమ్మడి రాజధాని అని ప్రశ్నిస్తున్న నమస్తే తెలంగాణ వ్యాసం తెలంగాణ ప్రభుత్వ అధికారిక విధానమా?రెండు రాష్ట్రప్రభుత్వాల వాదనలు ఎలా వున్నా రాజ్యాంగ పరంగా దీన్ని ఎలా చూడాలన్నది అసలు సమస్య. కేంద్రంలో పాలించే బిజెపి ఎపి అద్యక్షులే హైదరాబాదుపై 2024 వరకూ హక్కున్నాయని చెబుతున్నారు. దీనిపై లేఖ రాస్తానంటున్నారు. 4ఇరురాష్ట్రా ప్రజల మధ్య సుహృద్భావం వర్తిలుతున్న నేపథ్యంలో అకారణ వివాదాలు అవాంచనీయమైనవి. ఎపి ఆంబులెన్సును ఆపడంపై వచ్చిన విమర్శపై కొందరు ప్రాంతీయ కోణంలో విరుచుకుపడటం సరైంది కాదు. ఏపి తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్‌ కెసిఆర్‌ ఈ విషయంలో మాట్లాడుకున్నట్టు కనిపించదు. మాట్లాడలేదని మీరెందుకనుకుంటున్నారని సలహాదారు సజ్జల ఎదురు ప్రశ్న వేశారు గాని ఏం మాట్లాడారో చెప్పలేదు. హైకోర్టు ముందున్న పిల్‌లో కక్షిదారులుగా చేరిన ఎపి ప్రభుత్వం సుప్రీం కోర్టులోనూ దీనిపైకేసు వేసింది. మరి అక్కడైనా ఉమ్మడి రాజధాని విషయమై స్పష్టత వస్తుందేమో చూడాలి. రావాలని కోరుకోవాలి. రెండు ప్రభుత్వాతో పాటు కేంద్రం కూడా అందుకు బాధ్మత తీసుకోవాలి. ఒక స్నేహపూర్వకమైన రాజ్యాంగబద్దమైన స్పష్టతనివ్వాలి.