NTV Telugu Site icon

తెలకపల్లి రవి : పవన్‌ కళ్యాణ్‌ కేంద్ర పదవిపై కావాలనే కథలు

Tirupathi Lok Sabha By Elections Analysis

జనసేన అధినేత,సూపర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ను బిజెపి రాజ్యసభకు పంపిస్తుందని కొన్ని రోజులుగా కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఆయనను కేంద్ర క్యాబినెట్‌లోకి కూడా తీసుకుంటారని తర్వాత ఈ కథలు విస్తరించాయి.సోషల్‌మీడియాలో మొదలైన ఈ కథలు నెమ్మదిగా ఉధృత ప్రచారంగా మారాయి.ఇంతకూ వీటిలో వాస్తవమెంత?జనసేన నాయకులు వీటి గురించి ఏమంటున్నారు?
మొదటి విషయం ఇవి పూర్తిగా నిరాధారమైనవని జనసేన ముఖ్యనాయకులు కొట్టిపారేస్తున్నారు.బిజెపి నుంచి అలాటి ప్రతిపాదన ఏదీ రాలేదని వచ్చినా పవన్‌ ఒప్పుకోరని చెబుతున్నారు.తెలుగుదేశంతో పొత్తు వున్నప్పుడే అలాటి ఆఫర్లు వచ్చాయి. వాటిని పవన్‌ కళ్యాణ్‌ తోసిపుచ్చారు. వాస్తవానికి ఆ పార్టీ అధికారంలోకి రావడంలో తమ పాత్ర కూడా తక్కువేమీ కాదు గనక రాజ్యసభకు వెళ్లినా తప్పు వుండేది కాదన్న భావన ఆ పార్టీలో వుండిరది. కాని ఇప్పుడు అచ్చంగా బిజెపిపై ఆధారపడి రాజ్యసభకువెళల్డం జరిగేపని కాదని వారు అంత తేలిగ్గా ఇచ్చేవారూ కాదని జనసేన భావిస్తున్నది.

తమ పార్టీని రద్దు చేసి బిజెపిలో విలీనం చేస్తే తప్ప విడిగా వుంటే రాజ్యసభకు పంపే పరిస్థితి బిజెపి వంటి పార్టీలో వుండబోదని కూడా స్పష్టంగా చెబుతున్నారు. గతంలోనే అమిత్‌ షా బిజెపి అద్యక్షుడుగా వున్నప్పుడే విలీనం ప్రతిపాదనను పవన్‌ బహిరంగంగా తోసి పుచ్చారని అంతేగాక అలా అడగడం తప్పని కూడా విమర్శించారని వారు గుర్తుచేశారు.ఇప్పుడు రాజకీయ అవసరాల రీత్యా వ్యూహాత్మకంగా బిజెపితో కలసి పనిచేస్తున్నంత మాత్రాన వారితో కలసి పోవడానికి లేదా ఆధారపడటానికి పవన్‌ ఎప్పటికీ అంగీకరించబోరని ఒక సీనియర్‌ నాయకుడు వివరించారు.బిజెపి నేతలు కూడా పవన్‌కు కేంద్ర పదవి అన్న దానిపై ఎలాటి స్పందన వ్యక్తం చేయలేదు. మరి అలాటప్పుడు అసలు ఈ కథనం లేదా లీకేజీ ఎలా వచ్చిందనే దానిపైనా జనసేనకు సందేహాలున్నాయి.

ఇప్పుడున్న పరిస్థితులలో తెలుగుదేశం దాని అనుకూల మీడియా సంస్థలు కావాలనే ఈ కథనాన్ని వదిలాయని నెమ్మదిగా అందరూ అందుకున్నారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలోబిజెపి తమతో మనస్పూర్తిగా కలసి పనిచేయడం లేదనీ వారిలో చాలామందిపై టిడిపి వైసీపీ ప్రభావాలు వున్నాయనికూడా జనసేన అంచనాగా వుంది. బిజెపికి ఏకపక్షంగా మద్దతు ప్రకటిస్తున్న టిడిపి ఈ కథనాలను ప్రచారంలో పెట్టి తర్వాత ఖండనలు తెప్పించి తమ ప్రతిష్టకు భంగం కలిగించాలనుకుంటోందని కూడా ఆ సీనియర్‌ నాయకుడు ఆరోపించారు. దీనివెనక కొందరు బిజెపి వారి హస్తం కూడావుండవచ్చునని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితులలో పవన్‌ కళ్యాణ్‌ కొన్ని సినిమాలు పూర్తి చేసే పనిలో వుంటే కేంద్ర మంత్రి పదవి వంటి రాజకీయ బాధ్యతలు తీసుకోవడం గురించి ఎలా అలోచిస్తారని కూడా ప్రశ్నించారు