ఏపీలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం భౌతిక దాడుల వరకు వెళ్లింది. దీంతో అధికార పార్టీపై ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. ఈ అంశంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఏపీకి కేంద్ర బలగాలు పంపాలని చంద్రబాబు హోంశాఖ అధికారులకు లేఖ రాశారు. మరోవైపు వైసీపీ దాడులకు నిరసనగా గురువారం నాడు చంద్రబాబు 36 గంటల దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్ష పూర్తయిన తర్వాత శనివారం ఆయన ఢిల్లీకి పయనం కానున్నారు. ఢిల్లీ పర్యటనలో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నట్లు తెలుస్తోంది.
అయితే చంద్రబాబుకు అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇస్తారా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో బీజేపీతో టీడీపీ స్నేహపూర్వకంగా మెలిగినా 2019 ఎన్నికలకు ముందు ఆ స్నేహం చెడిపోయింది. ఆ సమయంలో చంద్రబాబు ఏకంగా ప్రధాని మోదీపై యుద్ధానికి దిగారు. ఆయన్ను గద్దె దింపడమే లక్ష్యంగా పావులు కదిపారు. బీజేపీని అధికారంలోకి రాకుండా చేసేందుకు తమ చిరకాల శత్రువు అయిన కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నారు. అయితే చంద్రబాబు ప్రయత్నాలు ఫలించలేదు సరి కాదా ఆయనకే రివర్స్ అయ్యాయి. కట్ చేస్తే ఏపీలో అధికారం కోల్పోయారు.
2019లో టీడీపీపై వైసీపీ ఘనవిజయం సాధించిన తర్వాత బీజేపీకి సారథి మారారు. గతంలో వైసీపీతో సన్నిహితంగా మెలిగిన సోమువీర్రాజు ఏపీలో బీజేపీ రథసారథిగా నియమితులయ్యారు. సోము వీర్రాజు బీజేపీ పగ్గాలు చేపట్టాక అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా రానున్న బద్వేల్ ఉప ఎన్నికలోనూ బీజేపీ పోటీ చేయడం లేదు. దీంతో బీజేపీతో వైసీపీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ ప్రచారం నిజమా కాదా అన్నది పక్కన పెడితే టీడీపీ మళ్లీ బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలను చూస్తే అర్థమవుతోంది. కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీతో స్నేహం కొనసాగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో జగన్‌ను ఇరుకున పెట్టాలంటే అదొక్కటే మార్గమని ఆయన భావిస్తున్నారు.
అయితే టీడీపీ దగ్గరవ్వాలని ఎంత ప్రయత్నించినా కమలనాథుల మనసులో ఏముందో తెలియడం లేదు. ఒకవైపు వైసీపీ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ సర్కారుకు పలు అంశాల్లో మద్దతు ఇస్తుండగా.. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ టీడీపీని అక్కున చేర్చుకుంటుందా అంటే సందేహంగానే ఉంది. అందులోనూ గతంలో ఏపీలో మోదీ, అమిత్ షా అడుగుపెట్టకుండా చంద్రబాబు నిరసనలు కూడా తెలిపారు. అమిత్ షా తిరుపతి వచ్చినప్పుడు అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ఆయనపై రాళ్లు వేయించిందన్న విమర్శలు కూడా వచ్చాయి. మరిప్పుడు ఏ మఖం పెట్టుకుని చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలుస్తారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అందితే జుట్టు లేదంటే కాళ్లు పట్టుకునే రకమంటూ ఇప్పటికే మంత్రి కొడాలి నాని బహిరంగంగానే విమర్శించారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబుకు అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇస్తారా అని ఏపీలోని అధికార పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఒకవేళ చంద్రబాబుకు అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇస్తే కొత్త రాజకీయ సమీకరణాలకు తెర లేచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమిత్ షాతో చంద్రబాబు ఏం చర్చిస్తారు అన్న విషయంపైనా ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఏపీలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు చర్చిస్తారని, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరే అవకాశముందని తెలుస్తోంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని, డీజీపీ ప్రభుత్వంతో లాలూచీ పడి ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు ఫిర్యాదు చేస్తారని టీడీపీ నేతలు చెప్తున్నారు.