సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన దేశవ్యాప్తంగా విషాదం నింపింది. తమిళనాడులోని కూనూరు సమీపంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన దుర్ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టేలా స్థానిక అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు చెప్పారు. తాను కూడా ఘటనా స్థలికి వెళ్తున్నట్టు ట్విటర్‌లో తెలిపారు.
ప్రమాదం వార్త తెలిసిన వెంటనే తమిళనాడు మంత్రులు అలర్ట్ అయ్యారు. హెలికాప్టర్ ప్రమాద ఘటనాస్థలికి తమిళనాడు అటవీశాఖ మంత్రి కె. రామచంద్రన్ సందర్శించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చినట్లు ఆయన చెప్పారు. ప్రమాద సమయంలో మొత్తం 14 మంది హెలికాప్టర్‌లో ఉన్నారని.. వారిలో ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోందన్నారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రామచంద్రన్ తెలిపారు.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిల్లీలోని సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ నివాసానికి వెళ్లారు. ఆయన వెంట పలువురు రక్షణశాఖ, ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు. ప్రమాదం గురించి కుటుంబసభ్యులతో మాట్లాడారు. తమిళనాడులోని ఘటనాస్థలికి రాజ్‌నాథ్ వెళ్లనున్నారని తెలుస్తోంది.
