(సెప్టెంబర్ 5న ‘సూర్య ఐపీఎస్’ కు 30 ఏళ్ళు)
వెంకటేశ్, విజయశాంతి కలసి నటించిన ‘శత్రువు’ ఘనవిజయం సాధించింది. ఆ సినిమా తరువాత వారిద్దరూ జోడీగా నటించిన ‘సూర్య ఐపీఎస్’ చిత్రం జనం ముందు నిలచింది. ఈ చిత్రానికి ఎ.కోదండరామిరెడ్డి దర్శకుడు. వెంకటేశ్, కోదండరామిరెడ్డి కాంబోలో వచ్చిన తొలి చిత్రం ఇదే. దీని తరువాత ‘పోకిరి రాజా’ వచ్చింది. ఈ రెండు చిత్రాలు అంతగా అలరించలేకపోయాయి. వాటిలో ‘సూర్య ఐపీఎస్’ ఫరవాలేదని చెప్పవచ్చు. టి.సుబ్బరామిరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం ఓ ఎస్సెట్.
సరదా బుల్లోడులా సాగుతున్న సూర్యను ఆయన తాత బలవంతంగా పోలీస్ ఫోర్స్ లో చేర్పిస్తారు. అక్కడ క్లాస్ మేట్ శిరీష తారసపడుతుంది. ఆమెపై అతను మోజు పెంచుకుంటాడు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు. ఇక సూర్య తండ్రి జగదీశ్వరరావు, ముఖ్యమంత్రి చెల్లెలిని పెళ్ళాడటానికి సూర్య తల్లిని చంపి ఉంటాడు. భార్యను చంపిన నేరాన్ని కన్నతండ్రిపైనే మోపుతాడు జగదీశ్వరరావు. పోలీస్ ట్రైనింగ్ అయిన తరువాత సూర్య, శిరీష పోలీసాఫీసర్స్ అవుతారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న శిరీష తండ్రిని జగదీశ్వరరావు చంపిస్తాడు. తరువాత ఆమె ఎన్నికల్లో గెలుస్తుంది. ఆమెను రక్షించి, తండ్రిని సైతం శిక్షిస్తాడు సూర్య.
ఈ చిత్రంలో సత్యనారాయణ, చరణ్ రాజ్, చారు హాసన్, నూతన్ ప్రసాద్, శరత్ కుమార్, రాళ్ళపల్లి, గోకిన రామారావు, కోట శంకరరావు, నారాయణరావు, మాస్టర్ తరుణ్ నటించారు. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ రచన చేయగా, సినారె, వేటూరి, సీతారామశాస్త్రి పాటలు రాశారు. “ఓం నమో నమ యవ్వనమా…”, “నెలరాజా… “, “వెయ్యిన్నొక్క జిల్లాల..” పాటలు అలరించాయి. ఈ సినిమా పాటలు అలరించాయే కానీ, చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.