Site icon NTV Telugu

కుప్పంలో చంద్రబాబుకు చెక్‌ పెట్టేలా వైసీపీ ఎత్తుగడలు…!

కుప్పంలో వైసీపీ నేతలు ఏం చేసినా టీడీపీ అధినేత చంద్రబాబు కోసమేనట. ఒక పథకంతో రెండు ప్రయోజనాలను పొందే లక్ష్యంతో పావులు కదుపుతున్నట్టు చెబుతున్నారు. దానిపైనే ఇప్పుడు రెండు పార్టీల్లోనూ చర్చ. అదేంటో ఇప్పుడు చూద్దాం.

కుప్పంలో నాడు-నేడు పథకానికి ప్రాధాన్యం

టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పం. వరసగా ఏడుసార్లు అక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు. కిందటి ఎన్నికల్లో జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో టీడీపీకి దక్కింది కుప్పమే. ఆ ఎన్నికల్లోనే వైసీపీ పూర్తిగా ఇక్కడ ఫోకస్‌ పెట్టింది. ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో రెండు రౌండ్లు చంద్రబాబు వెనకబడ్డారు. ఆ ఎన్నికల తర్వాత వైసీపీ ఫోకస్‌ ఇంకా పెరిగింది. వచ్చే ఎన్నికల నాటికి కుప్పంలో వైసీపీ జెండా ఎగరాలన్నదే లక్ష్యంగా పావులు కదుపుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలోని 90 పంచాయతీల్లో 80 చోట్ల వైసీపీ పాగా వేసింది. ఇక తగ్గేదే లేదన్నట్టుగా అధికారపార్టీ కేడర్‌ కుప్పంలో గ్రౌండ్‌వర్క్ చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు నాడు-నేడు కార్యక్రమం వారికి మంచి అవకాశంగా దక్కిందట. దానిపైనే రెండు పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది.

కుప్పంలో స్కూళ్ల అభివృద్ధికి రూ. 30 కోట్లు
కుప్పంలోని ఒక్క స్కూల్‌కే రూ. కోటి!

నాడు-నేడు పథకంలో భాగంగా కుప్పంలోని స్కూళ్లకు మహర్దశ పట్టించబోతున్నారట. ఒక్క కుప్పంలోని స్కూళ్లకే 30 కోట్లు వెచ్చించినట్టు సమాచారం. నియోజకవర్గంలోని కుప్పం, శాంతిపురం, గుడుపల్లె, రామకుప్పం మండలాల పరిధిలోని 117 ప్రభుత్వ పాఠశాలల కోసం సుమారు 30 కోట్ల 26 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో కుప్పం పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలను డెమో స్కూల్‌గా ఎంపిక చేసారు. ఈ ఒక్క స్కూల్‌కే 90 లక్షలను కేటాయించగా.. తాజాగా మరో 8 లక్షలకు సంబంధించి ప్రతిపాదనలు పంపారట. అంటే ఈ ఒక్క పాఠశాలపైనే దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నారు. శాంతిపురం మండల పరిధిలోని మోడల్ స్కూల్‌కు 89 లక్షలతో పనులు చేయగా.. అదనంగా 16 లక్షల విలువైన పనులకు ప్రతిపాదనలు పంపారట.

చంద్రబాబు కంటే తమ హయాంలోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందని చెప్పడానికా?

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కంటే తాము అధికారంలోకి వచ్చాకే కుప్పంలో ఎక్కువ అభివృద్ధి జరుగుతోందని చెప్పడానికి వైసీపీ నేతలు ఈస్థాయిలో స్కూల్స్ అభివృద్ధిపై దృష్టి పెట్టారని టాక్. చంద్రబాబు టార్గెట్‌గా ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోరాదని ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేడర్‌కు సూచించారట. మొన్నటి మొన్న శ్రీకృష్ణదేవరాయలు విగ్రహ ఏర్పాటు వివాదాన్ని పరిష్కారించి వైసీపీ పైచెయ్యి సాధించిందని ప్రచారం జరుగుతోంది.

అభివృద్ధితో ప్రజల మనసు దోచుకోవడం.. చంద్రబాబుకు చెక్‌ పెట్టడం!

ఇప్పుడు స్కూళ్ల విషయంలో ఖర్చుకు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జిల్లాలో ఎక్కడా లేనిది కుప్పంలోనే ఎందుకింత ఖర్చు అని కొందరు విమర్శలు చేస్తున్నా.. అధికారపార్టీ నేతలు అవేమీ పట్టించుకోవడం లేదట. పైగా ఏం చేసినా చంద్రబాబు కోసమే అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారట. అభివృద్ధి ద్వారా కుప్పం ప్రజల మనసు గెలుచుకోవడం.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు చెక్‌ పెట్టడం.. ఈ రెండు లక్ష్యాలతోనే వైసీపీ చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. మరి.. అధికార పార్టీ వ్యూహం రానున్న రోజుల్లో ఏ మాత్రం వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

Exit mobile version