NTV Telugu Site icon

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి దారెటు…?

ఆయనో మాజీ ఎంపీ. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి నెలలు గడుస్తున్నా.. భవిష్యత్‌ ప్రయాణం ఏంటో వెల్లడించలేదు. కాసేపు అటు.. మరికాసేపు ఇటు అన్నట్టు ఆయన ట్వీట్లు ఉంటున్నాయా? ఇంతకీ ఆయన ఆ గట్టున ఉంటారా.. ఈ గట్టున రిలాక్స్‌ అవుతారా?

క్రాస్‌రోడ్స్‌లోనే ఉండిపోయారా?

కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. టీఆర్‌ఎస్‌లో ఉండగా.. చేవెళ్ల నుంచి ఎంపీగా గెలిచారు. అధికార పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో రాజకీయంగా లక్‌ కలిసి రాలేదు. ఇక అక్కడ ఉండటం అవసరం లేదనుకున్నారో ఏమో.. హస్తానికి హ్యాండిచ్చారు. అప్పటి నుంచి కొండా పొలిటికల్‌ స్టెప్పులపై జరగని చర్చ లేదు. బీజేపీలోకి వెళ్లిపోతున్నారనే టాక్స్‌ పీక్స్‌కు వెళ్లాయి. కాషాయం కండువా కప్పుకోవడం ఒక్కటే మిగిలిందని రకరకాల ముహూర్తాలు బయటకొచ్చాయి. కానీ ఆయన గడప దాటింది లేదు. లెక్కలు కుదరలేదో.. ఎక్కడాల్సిన బస్‌ ఇంకా రాలేదో ఏమో.. క్రాస్‌ రోడ్స్‌లోనే ఉండిపోయారు.

కొండా ట్వీట్లతో గందరగోళం

ప్రస్తుతం కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చిక్కడు.. దొరకడు అన్నట్టుగా మారిపోయారు. ఇదే సమయంలో ఆయన ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా చేస్తున్న కామెంట్స్‌ మరింత గందరగోళానికి దారితీస్తున్నాయి. ఆయన కన్ఫ్యూజన్‌లో ఉన్నారో.. ఎదుటివారిని కన్ఫ్యూజన్‌లో పెడుతున్నారో కానీ.. ఒక పట్టాన ఆయన వైఖరి అర్థం కావడం లేదు. తిరిగి కాంగ్రెస్‌ కండువా కప్పుకొంటున్నారేమోనని ఆయన ట్వీట్లు ఉంటాయి. ఇంతలోనే బీజేపీలోకి లైన్‌ క్లియర్‌ అయ్యిందేమో అన్నట్టుగా మరో ట్వీట్‌ పెడతారు.

రేవంత్‌, సంజయ్‌లను ట్యాగ్‌ చేస్తారు!
రాయలసీమ రెడ్డిల అభిమానిని కాదని బదులిస్తారు

ఇటీవలే పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జరిగింది. ఈ రెండు అంశాలపై ఒకటే ట్వీట్‌ చేశారు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. మరో అంశంలో ఓ పత్రికలో వచ్చిన వార్తను ప్రస్తావిస్తూ రేవంత్‌రెడ్డిని, బండి సంజయ్‌ను ట్యాగ్‌ చేశారు.
వీరిద్దరినీ ఎందుకు ట్యాగ్‌ చేశారని ప్రశ్నిస్తే.. వారిద్దరికే సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లను పంపించే సత్తా ఉందని బదులిచ్చారు. ఏదో ఒక పార్టీలో చేరండి అని అడిగితే తొందరేమీ లేదన్నది ఆయన ఆన్సర్‌. షర్మిల పార్టీలో చేరొచ్చుగా అని ఎవరో సూచిస్తే.. సీఎం కేసీఆర్‌కు లాభం కలిగే పని చేయనని బదులిచ్చారు. పైగా తాను క్రిస్టియన్‌ అభిమానిని కాదని.. రాయలసీమ రెడ్డిల అభిమానిని కూడా కాదని సమాధానం ఇచ్చారు.

కాంగ్రెస్‌, బీజేపీలలో ఏ పార్టీకి మాజీ ఎంపీ దగ్గర?

మొత్తానికి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ట్విట్టర్‌ వేదికగా చేస్తున్న పోస్టులు.. కామెంట్స్‌ ఒక పట్టాన అంతుచిక్కడం లేదు. ఆయన కాంగ్రెస్‌కు దగ్గరో.. బీజేపీకి చేరువో తెలియడం లేదు. పైగా రెండు పార్టీలతోనూ సంబంధాలు కొనసాగిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో.. ఇటీవల ఈటల బీజేపీలో చేరిన సందర్భంలో కమలనాథులు ఆయన్ని కలిసి చర్చించారు. ఎవరొచ్చి మాట్లాడినా.. ఆయన క్లారిటీ ఇవ్వడం లేదు. మరి.. మాజీ ఎంపీ పయనం ఎటో చూడాలి.