ఏదైనా సమస్య వస్తే నాయకుడి దగ్గరకు కేడర్ వెళ్లడం సాధారణం. పార్టీ పవర్‌లో ఉన్నా.. లేకపోయినా.. శ్రేణులకు అందుబాటులో ఉన్న నేతలే దేవుళ్లు. ఆ జిల్లాలో మాత్రం కేడర్‌ను, పార్టీని పట్టించుకునే వాళ్లు లేరు. తమ్ముళ్లు దిక్కులేని వారిగా మారిపోయారు. అధినేత ఎప్పుడు కరుణిస్తారా అని రెండేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు.
చిత్తూరు జిల్లాలో దిక్కులేకుండా పోయిన టీడీపీ కేడర్!
చిత్తూరు జిల్లాలో తెలుగు తమ్ముళ్లకు ఈ దఫా పెద్దకష్టమే వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా కావడంతో అంతా సవ్యంగా ఉంటుందని అనుకుంటే పొరపాటే. 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జిల్లాలో టీడీపీని గట్టి దెబ్బే తీశాయి. 14 అసెంబ్లీ స్థానాలుంటే.. కుప్పంలో చంద్రబాబు మినహా ఎవరూ గెలవలేదు. ఆపై మారిన పరిణామాలు భయపెట్టాయో.. కొన్నాళ్లు సైలెంట్‌గా ఉందామనుకున్నారో ఏమో ఎన్నికల్లో పోటీ చేసిన వారు పత్తా లేకుండా పోయారు. కొందరు కండువా మార్చేస్తే.. ఇంకొందరు సొంత వ్యాపారాల్లో మునిగిపోయారు. ఎటొచ్చీ కేడర్‌కే దిక్కులేకుండా పోయింది.
అధికారంలో ఉన్నప్పుడు పవర్ ఎంజాయ్ చేశారు.. ఓడిపోయాక పత్తా లేరు!
పూతలపట్టు ఇంఛార్జ్‌గా ఉన్న లలిత కుమారి టీడీపీకి గుడ్‌బై చెప్పేశారు. తంబళ్లపల్లె ఇంఛార్జ్ శంకర్, పుంగనూరు ఇంచార్జ్ అనీషారెడ్డి, జీడీ నెల్లూరు ఇంఛార్జ్ హరికృష్ణలు పార్టీ కేడర్‌కు టచ్‌లో లేరు. మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ మృతితో చిత్తూరులో ఇంఛార్జ్ పోస్ట్ ఖాళీగా ఉంది. 14 నియోజకవర్గాల్లో ఐదుచోట్ల టీడీపీ బాధ్యతలు చూసేవాళ్లు లేరు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పవర్‌ను ఎంజాయ్ చేసి.. కేడర్‌ను చిన్న చూపుచూశారనే విమర్శలు వచ్చాయి. ఎప్పుడైతే పార్టీ పవర్‌కు దూరమైందో.. పత్తా లేకుండా చెక్కేశారు.
అధినేతకు చెప్పినా ఉలుకు లేదా?
అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రెండేళ్లు అవుతోంది. ఈ రెండేళ్ల కాలంలో తమ బాధలు.. సమస్యలు చెప్పుకుందామని కేడర్ చూస్తోంటే.. ఇంఛార్జులు లేరు. అధినేతకు తమ గోడు వెళ్లబోసుకున్నా.. అటు నుంచి ఉలుకు లేదు. చిత్తూరు జిల్లాకు చంద్రబాబు వచ్చిన ప్రతిసారీ తెలుగు తమ్ముళ్లు మొర పెట్టుకుంటూనే ఉంటున్నారు. కొత్త ఇంఛార్జ్‌ను పెడతామని ఆయన హామీ ఇస్తున్నారు తప్ప.. అవి మాటలుగానే ఉండిపోతున్నాయి. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీతో గట్టిగా పోరాడిన కేడర్.. ఎలక్షన్స్ తర్వాత ఎదురవుతున్న ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలని ఈ మధ్య జరిగిన పార్టీ మీటింగ్‌లో నిలదీశారట. చివరకు చినబాబు లోకేష్‌కు సైతం మొరపెట్టుకున్నారట.
ఇతర పార్టీలలోకి వెళ్లిపోతున్న కేడర్!
గ్రూపులు పెరుగుతాయని ఇంఛార్జులను పెట్టడం లేదా?
టీడీపీ పెద్దలు తమ ఆర్తిని పట్టించుకోరని అనుకున్నారో లేక అడిగి అడిగి ఉపయోగం లేదని భావించారో కానీ.. ఆ ఐదు నియోజకవర్గాల్లోని పార్టీ కేడర్ నెమ్మదిగా సర్దుకోవడం మొదలుపెట్టింది. వైసీపీ, జనసేన, బీజేపీల్లోకి జారుకుంటున్నారు. ఆ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని గ్రామాల్లో కనిపించింది. టీడీపీకి అభ్యర్థులు దొరకలేదు. సొంత జిల్లాలోని విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న చంద్రబాబు.. ఇప్పుడే ఇంఛార్జ్‌లను నియమిస్తే.. గ్రూపులు పెరుగుతాయని అనుకుంటున్నారో ఏమో ఎప్పటిలా నాన్చుతున్నారనే అభిప్రాయం తమ్ముళ్లలో ఉందట. మరి.. బాబుగారి సొంత జిల్లాలో పార్టీ కేడర్ కష్టాలు ఎప్పుడు తీరతాయో..!
