Site icon NTV Telugu

అనంతపురం టీడీపీలో తారాస్థాయికి వర్గపోరు!

పార్టీ అధికారంలో లేకపోయినా కయ్యానికి కాలు దువ్వడానికి ఏ మాత్రం సంకోచించడం లేదట తెలుగు తమ్ముళ్లు. పార్టీ పెద్దల దగ్గర ‘రాజీ’ పడుతున్నట్టు చెబుతున్నా.. బయటకొచ్చాక కుస్తీలే. దీంతో టీడీపీ అధిష్ఠానం కూడా ఆ నియోజకవర్గాలను వదిలేసిందని ప్రచారం జరుగుతోంది. ఎందుకో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

టీడీపీ పెద్దలకు మింగుడు పడని వర్గపోరు!

ఒకప్పుడు టీడీపీకి పెట్టని కోటల్లో అనంతపురం జిల్లా కూడా ఒకటి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ రెండుచోట్లే గెలిచింది. మిగతాచోట్ల పార్టీ కేడర్‌ బలంగా ఉన్నా.. నాయకుల మధ్యే అస్సలు సఖ్యత లేదట. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి. ఈ విషయంలో జిల్లాలోని కల్యాణదుర్గం.. శింగనమల నియోజకవర్గాలు టీడీపీ పెద్దలకు మింగుడు పడటం లేదని టాక్‌.

కల్యాణదుర్గంలో ఆధిపత్యం కోసం పోరాటం!

కల్యాణదుర్గంలో టికెట్‌ ఇచ్చే దగ్గర మొదలైన గొడవ రావణకాష్టంలా రగులుతూనే ఉంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరిని కాదని.. ఉమా మహేశ్వరనాయుడికి నాడు టికెట్‌ ఇచ్చారు. దాంతో నియోజకవర్గంలో టీడీపీ కేడర్‌ చౌదరి వర్గం.. ఉమా వర్గాలుగా చీలిపోయింది. స్వపక్షంలోనే విపక్షంగా మారి తన్నుకుంటూ.. అధికారపక్షానికి వినోదం పంచుతున్నారు తమ్ముళ్లు. కలిసి టీడీపీని బలోపేతం చేయాలన్న పార్టీ పెద్దల మాట ఎవరికీ చెవికి ఎక్కడం లేదట. టీడీపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకపోయినా.. కల్యాణదుర్గంలో తెలుగుదేశం తమ అండర్‌లో ఉండాలన్నదే వీళ్ల అజెండాగా చెబుతారు.

సర్దిచెప్పినా కల్యాణదుర్గంలో దారికిరాని వర్గాలు!

కల్యాణదుర్గం మండలం కొండాపురంలో ఇటీవల టీడీపీ సర్పంచ్‌ ఏకగ్రీవంగా ఎన్నికకావడంతో విందు ఇచ్చారు. దీనికి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌ ఉమా వ్యతిరేక వర్గమంతా హాజరై తీవ్ర మంతనాలు చేసిందట. లోకల్‌ నాన్‌లోకల్‌ అంశాన్ని చర్చకు పెట్టాలని నిర్ణయించారట. బయట ప్రాంతం నుంచి వచ్చిన ఉమాకు మద్దతివ్వొద్దని తీర్మానించినట్టు చెబుతున్నారు. దీంతో మళ్లీ రెండు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. వాస్తవానికి రెండు వర్గాలకు సర్దిచెప్పడానికి రెండున్నరేళ్లుగా టీడీపీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్నివ్వడం లేదు. చంద్రబాబే నేరుగా జోక్యం చేసుకున్నా నో ఛేంజ్‌. దాంతో కల్యాణదుర్గం నేతలకు చెప్పడం మానేశారట.

శింగనమలలో మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం!
ఇంటిపోరుతోనే బలహీన పడుతున్న టీడీపీ!

ఇక శింగనమలలో టీడీపీ అంతర్గత పోరు బలంగానే ఉందట. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి శ్రావణి పోటీ చేసి ఓడిపోయారు. ఎస్సీ నియోజకవర్గమేనైనా కమ్మ, రెడ్డి సామాజికవర్గాల నేతలు చెప్పిందే ఇక్కడ వేదం. ఈ వర్గాలకు చెందిన నాయకులకు అస్సలు పడటం లేదట. ఇన్నాళ్లూ గొడవలను మౌనంగా భరిస్తూ వచ్చిన వారు.. అధిష్ఠానం పట్టించుకోకపోవడంతో మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమైనట్టు సమాచారం. విషయం తెలసుకున్న చంద్రబాబు శింగనమలలోని కొందరు సీనియర్లకు ఫోన్‌ చేసి వేచి చూడాలని కోరారట. కానీ.. అసమ్మతి నేతలు ఎంత కాలం వేచి చూస్తారన్నది అనుమానమే. జిల్లాలో కల్యాణదుర్గం, శింగనమల నియోజకవర్గాల్లో టీడీపీ కుమ్ములాటలను పార్టీ పెద్దలు సరిదిద్దలేని పరిస్థితి ఏర్పడినట్టు కేడర్‌ చెవులు కొరుక్కుంటోంది. రానున్న రోజుల్లోనూ ఇదే తీరుగా ఉంటే .. వైసీపీ ఎలాంటి రాజకీయ ఎత్తుగడలు వేయకుండానే.. టీడీపీ మరింత బలహీన పడుతుందని ఆందోళన చెందుతున్నారట తెలుగు తమ్ముళ్లు. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.

Exit mobile version