ఒకప్పుడు హైదరాబాద్ అంటే ట్రాఫిక్ జాంలు, కాలుష్యం.. కానీ ఇప్పుడు నగరం తీరు మారింది. నగరం అంతా పచ్చదనం పరుచుకుంటోంది. కాంక్రీట్ తో కట్టుకున్న ఫ్లై ఓవర్లు కింద పచ్చని మొక్కలు కనిపిస్తూ మనసుకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అసలు మనం సిటీలోనే వున్నామా.. ఇన్ని ఫ్లై ఓవర్లున్నా అంతగా కాలుష్యం రావడం లేదని అంతా అవాక్కవుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ చేపడుతున్న వివిధ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతున్నాయి. హైదరాబాద్‌లో షేక్ పేటలో నిర్మాణమవుతున్న అతిపెద్ద ఫ్లై ఓవర్ సెంట్రాఫ్ అట్రాక్షన్ కానుంది. కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తున్న టైంలోనే ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం ప్రారంభం అయింది. ఇప్పుడు తుదిమెరుగులు దిద్దుకుంటోంది.
పర్యావరణ పరిరక్షణ కోసం ఫ్లై ఓవర్ల కింద ప్రాంతాన్ని కన్జర్వేషన్ జోన్ గా మారుస్తున్నారు. చిన్న చిన్న ఖాళీ ప్రాంతాలను మట్టితో పూడ్చి అక్కడ అందమయిన మొక్కలు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. షేక్ పేట ఫ్లై ఓవర్ కోసం ప్రభుత్వం 3.6 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తోంది. నగరంలోని వెస్ట్రన్ పార్ట్ లో ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తిచేసుకోబోతోంది. ఇటు ఈస్ట్రన్ పార్ట్ లో ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రి వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం అయ్యే చోట చిన్న చిన్న పార్కులు ఏర్పాటుచేస్తున్నారు.
షేక్ పేట ఫ్లై ఓవర్ కింద రూపుదిద్దుకుంటున్న పచ్చదనం

షేక్ పేట ఫ్లైఓవర్ భారీగా రూపుదిద్దుకుంటోంది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్లాన్ (SRDP) కింద ఈ ఫ్లై ఓవర్ పూర్తయింది. త్వరలో దీనిపై నుంచి వాహనాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ ఫ్లై ఓవర్ కింద నుంచి వెళ్ళేవారికి పచ్చదనం వెల్ కం చెప్పనుంది. ఏ చిన్న ప్రాంతాన్ని వదలకుండా చుట్టూ ఐరన్ రాడ్స్ ఏర్పాటుచేశారు. అందులో మట్టి పోసి మొక్కలు నాటుతున్నారు. మొత్తం ఈ ఫ్లైఓవర్ 2.8 కిలోమీటర్లు వుంటుంది. వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటుచేశారు. ఇక్కడ ఏర్పాటుచేసే పార్కులో 30 రకాల మొక్కలు నాటుతున్నారు. మొత్తం 20 పిల్లర్స్ ఏర్పాటుచేశారు. ఈ పార్కుల్లో కూర్చోవడానికి సీటింగ్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. రెండు ఫౌంటేన్లు కూడా కనువిందు చేయనున్నాయి.
ఎల్ బీ నగర్ ఫ్లై ఓవర్ కి 2 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నారు. అక్కడ ఆక్సిజన్ పార్కులతో పాటు 734 మీటర్ల వాకింగ్ ట్రాక్ కూడా వుంది. మంచి గ్రీనరీతో ఫ్లై ఓవర్ కింది పరిసరాలు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించనున్నాయి. ఎల్ బినగర్‌లో పార్కులతో పాటు 22 కార్లు, 40 బైక్‌లుపార్కు చేసుకునే సదుపాయం కూడా వుంది. పిల్లర్లకు అందమయిన రంగులేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. మొత్తం మీద కాంక్రీట్ జంగిల్లో కనువిందైన పచ్చదనం కనిపించనుంది.
(ఫోటోలు :GSN RAJU)