ఏపీ రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ అమరావతి ప్రాంత రైతులు మహాపాదయాత్ర చేస్తున్నారు. వీళ్లు అమరావతి నుంచి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతుల మహాపాదయాత్రకు బీజేపీ నేతలు సంఘీభావం తెలిపారు. ఆదివారం నాడు నెల్లూరు జిల్లాలో రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా కావలి వద్ద అమరావతి రైతుల ఆధ్వర్యంలో బీజేపీ నేతలు మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి పాల్గొన్నారు.
Read Also: మరోసారి మానవత్వాన్ని చాటుకున్న జగన్
ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడారు. అమరావతి ఒక్కటే ఏపీకి రాజధాని అన్నారు. ఈ మాటకు బీజేపీ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. అందువల్లే అమరావతిలో అనేక పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయని తెలిపారు. మరోవైపు రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని తాము అమరావతిలో నిర్మిస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. రైతుల పాదయాత్రలో చివరి వరకు బీజేపీ పాల్గొంటుందని… అమరావతి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
