NTV Telugu Site icon

పర్యాటకులకు శుభవార్త… త్వరలో విశాఖలో స్నో పార్కు ఏర్పాటు

త్వరలో ఏపీకి విశాఖ నగరం ఏకైక రాజధాని అయ్యే అవకాశాలున్నాయి. వచ్చే ఉగాదికి ఈ విషయంపై క్లారిటీ రానుంది. అయితే ఆలోపు విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని జగన్ సర్కారు ప్రణాళికలు రచిస్తోంది. విశాఖ నగరంలో స్నో పార్క్ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. విశాఖలో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ విశాఖపట్నం స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2 ఎకరాల్లో రూ.20 కోట్ల అంచనా వ్యయంతో ఈ స్నో పార్క్ ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Read Also: భార్య‌ను టీజ్ చేశార‌ని… ఆయ‌న ఓ ప్ర‌పంచాన్నే సృష్టించాడు…

మంచులో బాస్కెట్ బాల్ ఆట ఆడుకునేలా సౌకర్యాలు కల్పించాలని.. ఓ హోటల్ కూడా ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. విశాఖలో స్నో పార్క్ ఏర్పాటు చేయడానికి డీపీఆర్ తయారుచేయడానికి విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ పార్కును పర్యాటకులను విశేషంగా ఆకర్షించేలా తీర్చిదిద్దాలని ఏపీ సర్కారు ఆదేశించినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ మేరకు చిన్న చిన్న మంచు పర్వతాలను కూడా పార్కులో ఏర్పాటు చేయనున్నారు. దీంతో సినిమా షూటింగ్‌లు కూడా జరుపుకునే అవకాశం ఉండేలా ఈ స్నో పార్కును ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. విశాఖలోని బీచ్‌ రోడ్డులో స్నో పార్కు ఏర్పాటు చేసే అవకాశముందని స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఛైర్మన్ గన్నమనేని వెంకటేశ్వరరావు వెల్లడించారు.