NTV Telugu Site icon

అలర్ట్: ఎల్లుండి నుంచి కొత్త ఛార్జీలు

SBI

SBI

జూన్‌ రేపటితో ముగిసిపోనుంది.. ఎల్లుండి జులైలోకి ఎంట్రీ అవుతున్నాం.. అంతే కాదు.. కొత్త బాదుడు కూడా షురూ కాబోతోంది… దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్త ఛార్జీలను వడ్డించేందుకు సిద్ధమైంది.. ఏటీఎం, బ్యాంకు బ్రాంచ్‌ల ద్వారా చేసే న‌గ‌దు విత్‌డ్రాల‌పై సేవా రుసుముల‌ను సవరిస్తూ నిర్ణయిం తీసుకుంది ఎస్బీఐ… చెక్‌బుక్, న‌గ‌దు బ‌దిలీ, ఇత‌ర ఆర్థికేత‌ర లావాదేవీలకు కొత్త ఛార్జీలు వర్తించనున్నాయి.. బేసిక్ సేవింగ్స్‌ బ్యాంక్ డిపాజిట్‌(బీఎస్‌బీడి) ఖాతాదారుల‌కు కూడా ఈ రుసుములు జులై 1వ తేదీ నుంచి వ‌ర్తిస్తాయ‌ని ప్రకటించింది ఎస్బీఐ.

సవరణల ప్రకారం.. ఒక నెల‌లో బ్యాంక్ బ్రాంచ్‌లు, ఏటీఎం వ‌ద్ద క‌లిపి నాలుగు ఉచిత న‌గ‌దు లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటు ఉండగా.. ఆ సంఖ్య పెరిగితే.. క్యాష్‌ విత్‌డ్రాపై ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ బ్రాంచ్‌/ ఏటీఎం వ‌ద్ద ప‌రిమితికి మించి చేసే ఒక్కో విత్‌డ్రాపై రూ.15+జీఎస్‌టీ వ‌సూలు చేయనున్నారు.. ఈ విత్‌డ్రాలు హోమ్ బ్రాంచ్, నాన్ ఎస్‌బీఐ ఎటీఎం వ‌ద్ద చేసినా ఛార్జీలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.. ఇక, చెక్‌బుక్స్‌ విషయానికి వస్తే.. ఒక ఫైనాన్షియల్‌ ఇయర్‌లో బీఎస్‌బీడీ ఖాతాదారుల‌కు 10 చెక్ లీవ్స్‌ను ఉచితంగా ఇస్తుంది ఎస్బీఐ.. ఆ తర్వాత అందించే చెక్కుల‌కు కొంత మొత్తాన్ని వ‌సూలు చేయాని నిర్ణయించారు.. 10 లీవ్స్‌తో ఉన్న చెక్‌బుక్‌కి రూ.40+జీఎస్టీ, 25 లీవ్స్‌తో ఉన్న చెక్‌బుక్‌కి రూ.75+జీఎస్టీ వసూలు చేయనున్నారు.. ఇక, అత్యవ‌స‌ర చెక్ బుక్.. 10 లీవ్స్ లేదా అందులో కొంత భాగం ఉన్న చెక్‌బుక్‌కి అయితే, రూ.50+జీఎస్టీ వడ్డించనున్నారు.. మరోవైపు.. ఎస్బీఐ, ఎస్బీఐయేత‌ర బ్యాంక్‌ల శాఖ‌ల్లో బీఎస్బీడీ ఖాతాదారుల ఆర్థికేత‌ర లావాదేవీల‌పై చార్జీలు వ‌సూలు చేయ‌రు. ఈ ఖాతాదారుల‌కు బ్రాంచ్‌లు, ప్రత్యామ్నాయ మార్గాల్లో చేసే లావాదేవీలు కూడా ఫ్రీగానే పొందవచ్చు.. క‌రోనా సెకండ్‌ వేవ్ నేప‌థ్యంలో ఎస్బీఐ నాన్ హోం బ్రాంచ్‌ల్లో చెక్ లేదా, క్యాష్ విత్ డ్రాయ‌ల్ ఫామ్‌తో న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ ప‌రిమితిని పెంచింది. చెక్ ద్వారా రూ. ల‌క్ష, ఎస్బీ ఖాతా పాస్‌బుక్‌తో రూ.25 వేల వ‌ర‌కు విత్ డ్రా చేసుకోవ‌చ్చు. థ‌ర్డ్ పార్టీ క్యాష్ విత్‌డ్రాల‌ను నెల‌కు రూ.50 వేలకు ప‌రిమితం చేసింది ఎస్బీఐ.. మొత్తం కొత్త సవరణలు జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి.